NTR Pathala Bhairavi: విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమి నందమూరి తారక రామారావు తెలుగు ఇండస్ట్రీ ఇలవేల్పుగా చెబుతుంటారు. తెలుగు సినిమాని దేశంలో నలుమూలలకు విస్తరించిన వారిలో ఆయన ప్రథములు. తెలుగు భాషపై ఎన్టీఆర్‌కు ఎనలేని గౌరవం అభిమానం. ప్రస్తుతం భౌతికంగా లేకపోయినప్పటికీ.. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుంటాయి. పౌరాణిక పాత్రలు చేయడంతో ఎన్టీఆర్‌కు ఎవరూ పోటీ లేరన్నది వాస్తవం. అలాంటి సినిమాల్లో ఓ క్లాసిక్ పిక్చర్‌కు రీసెంట్‌గా అరుదైన గౌరవం దక్కింది.
దివంగత నందమూరి తారక రామారావు దిగ్గజ దర్శకుడు కె.వి. రెడ్డి తీసిన పాతాళ భైరవి 1951లో విడుదలైంది. అప్పట్లోనే ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాలో ఎస్‌వీ రంగారావు కూడా కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NFDC) నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (NFAI), పూణే వారు పాతభైరవి ఆల్‌టైమ్ క్లాసిక్ ఫిల్మ్‌గా గుర్తించారు. అంతేకుండా ఇది ఇండియన్ సినిమా ఆస్తి కింద.. పాతాళ భైరవిని డిజిటల్‌గా పునరుద్ధరించారు.
అంటే పాతాల భైరవి సినిమాను గొప్ప సినిమా అని దాని డిజిటల్ రైట్స్‌ను భద్రపరుస్తున్నట్లు నేషనల్ ఫిల్మి డెవలప్‌మెంట్, పుణే వారు తెలిపారు. ఓ తెలుగు సినిమాకు అందులోనూ 1951లో తీసిన చిత్రానికి అరుదైన గౌరవం దక్కడంపై తెలుగు సినీ అభిమానులు, నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని క్లాసిక్, పౌరాణిక చిత్రాలను భద్రపరచనున్నట్లు నేషనల్ ఫిల్మ్ కార్పొరేషన్ వారు తెలిపారు. అయితే.. పాతాళభైరవి సినిమాను ఇప్పడు భద్రపరచడంతో.. భవిష్యత్తులో థియేటర్లలో చూసే అవకాశం ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. డిజిటల్ రైట్స్ భద్రపరిచిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ చిత్రం 75వ వార్షికోత్సవం సందర్బంగా చిత్రాన్ని రీరిలీజ్ చేస్తారా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రేక్షకులు పాతాళ భైరవిని కొత్తగా పునర్నిర్మించిన డిజిటల్ రూపంలో చూడటానికి వీలుంటుందా లేదా అన్నాది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.
పాతాళభైరవి సినిమాకి పింగళి నాగేంద్రరావు కథను అందజేశారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాలో దిగ్గజ ఘంటసాల మరపురాని సంగీతం అందించారు. నిజంగా పాతాళ భైరవి తెలుగు సినిమా చరిత్రలో గర్వించదగ్గ చిత్రంగా మిగిలిపోయింది.