
ఆర్ ఆర్ ఆర్ స్టార్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలైంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ రూపొందించిన యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ సైతం అప్డేట్ ఇచ్చారు. 'వస్తున్నా' అంటూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. కొరటాల శివతో పని చేయడం చాలా గొప్పగా ఉందంటూ కామెంట్ కూడా చేశారు.
కాగా హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన వెంటనే టీం గోవా వెళుతున్నారట. దర్శకుడు కొరటాల శివ సెకండ్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశాడట. అక్కడ ప్రధాన తారాగణం ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ షెడ్యూల్ కోసం ఆల్రెడీ గోవాలో ఓ సెట్ నిర్మించారని తెలుస్తుంది.
ఈ చిత్ర కథపై కొరటాల శివ లాంచింగ్ రోజు స్పష్టత ఇచ్చారు. ఇది సముద్ర తీరం నేపథ్యంలో సాగుతుంది. మానవ మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని వెల్లడించారు. యాక్షన్ తో పాటు బలమైన ఎమోషన్స్ కూడిన కథ అన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ 30 మీద హైప్ మరింతగా పెరిగింది.
దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ 30 నిర్మిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున రూపొందించనున్నారు. దర్శకుడు కొరటాల మేటి టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం బరిలో దించుతున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం అరుదైన అంశం. 2024 ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా విడుదల కానుంది.