భగవంతుడిని పూర్తిగా నమ్మే వ్యక్తిగా మరియు దేశంలోని దేవాలయాలను తరచుగా సందర్శిస్తున్న నేను మరోసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను.
అన్నపూర్ణి ఎప్పుడైతే ఓటీటీలో రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి నయనతార చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన అన్నపూర్ణి సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అదే సమయంలో వివాదాలను మూటగట్టుకుంది. సినిమాలో హిందువులను కించ పరిచే సన్నివేశాలున్నాయంటూ, లవ్ జిహాదీని ప్రోత్సహించేలా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. ఇక ఓటీటీలో రిలీజైన తర్వాత అన్నపూర్ణి వివాదం తారాస్థాయికి చేరుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అన్నపూర్ణి సినిమాతో పాటు నయనతారపై కూడా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం నయనతార సినిమాను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. ‘అన్నపూర్ణి’ సినిమాని ఏ వర్గాన్నీ కించపర్చే ఉద్దేశ్యంతో తెరకెక్కించలేదనీ, ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమాపణ కోరుతున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయినా ఈ సినిమాపై వ్యతిరేకత తొలగలేదు. ఈ నేఫధ్యంలో నయనతార ఓపెన్ లెటర్ రాసారు.
నయనతార తన చిత్రం ‘అన్నపూర్ణి’ చుట్టూ ఉన్న వివాదంపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది, ఎవరి భావోద్వేగాలను దెబ్బతీసే ఉద్దేశ్యం తనకు మరియు తన టీమ్ కి లేదని పేర్కొంది. అన్నపూర్ణి ఆందోళనలను ఉద్దేశించి నయనతార క్షమాపణ లేఖ రాసింది. నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ‘జై శ్రీరామ్’, హిందూ మత చిహ్నం ‘ఓం’ అని రాసి క్షమాపణలు చెప్పింది. నయనతార తన పోస్ట్‌లో, “ మేము పాజిటివ్ మెసేజ్ ని అందిచటానికి చేసిన మా హృదయపూర్వక ప్రయత్నంలో, మేము అనుకోకుండా మీకు బాధ కలిగించి ఉండవచ్చు. OTT ప్లాట్‌ఫారమ్ నుండి గతంలో థియేటర్‌లలో ప్రదర్శించబడి సెన్సార్ చేయబడిన సినిమా తీసివేయబడుతుందని మేము ఊహించలేదు. నా టీమ్,మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడూ అనుకోలేదు . ఈ సమస్య యొక్క తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. భగవంతుడిని పూర్తిగా నమ్మే వ్యక్తిగా మరియు దేశంలోని దేవాలయాలను తరచుగా సందర్శిస్తున్న నేను మరోసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను. ఈ సినిమా ద్వారా మనస్సులు గాయపడ్డవారికి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ ఆమె లెటర్ రాసారు.
ఇక ఈ సినిమా కథలో సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ యువతి నాన్‌వెజ్ వంటలు చేస్తూ పేరు తెచ్చుకోవడంతో పాటు ఓ రెస్టారెంట్‌ను పెట్టాలని కలలు కంటూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌తో పాటు ఓ హిందూ అమ్మాయి నమాజ్ చేసినట్లుగా సినిమాలో చూపించడం లవ్ జిహాద్‌ను ప్రేరేపించేలా ఉందని, మత విశ్వాసాలను దెబ్బ తినేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు మండి పడ్డాయి. రాముడు మాంసం తింటాడంటూ దేవుళ్లను కించపరిచే విధంగా సినిమాలో డైలాగులు ఉన్నాయంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) నేత శ్రీరాజ్ నాయర్ ఫైర్ అయ్యారు. అలానే బ్రాహ్మణ అమ్మాయి మాంసాహారం వండటం వంటి సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.బ్రాహ్మణులు నాన్ వెజ్ వండటం, తినడం అన్నది చాలా సెన్సిటివ్ పాయింట్. ఈ అంశమే వివాదాలు తెచ్చిపెట్టింది.