
కథః ఘట్టమనేని బ్యాగ్రౌండ్ హీరో సినిమా అంటే మాస్ మసాలాలన్నీ దట్టించి తీశారని అంతా అనుకుంటాం. కానీ పూర్తి భిన్నంగా చాలా సింప్లిసిటీతో హీరోగా మంచి మార్కులు కొట్టేశారు నవీన్. మాస్ మసాలా లాంటివేమీ లేకుండా ఒక సింపుల్ కథను సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నించినందుకు.. నవీన్ ను మాస్ హీరో ఇమేజ్ తో కంటే... కేవలం ఒక ‘నటుడి’గా పరిచయం చేయాలని చూసినందుకు నందిని నర్సింగ్ హోం టీంను అభినందించక ఉండలేం.
‘నందిని నర్సింగ్ హోం’ సింపుల్ గా సాగిపోయే ఒక కామెడీ ఎంటర్టైనర్. ప్రేక్షకుడి బుర్రకు పరీక్షలేమీ పెట్టకుండా టైంపాస్ చేయిస్తూ సాగిపోయే కథ ఇది. బోర్ కొట్టించకుండా టైంపాస్ చేయించేయడంలో మాత్రం ఈ సినిమా విజయవంతమైంది. కామెడీ ప్రధాన పాత్ర పోషించింది. హార్రర్.. సస్పెన్స్ కూడా స్టోరీలో ఉన్నప్పటికీ.. వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కథనం నడిపించే ప్రయత్నమే చేశాడు కొత్త దర్శకుడు పి.వి.గిరి. ప్రేమ కథాంశం ఉన్నా.. సినిమాకు ఆకర్షణ మాత్రం కామెడీనే.
పోలీసులకు భయపడి కోమాలో ఉన్నవాడిగా నటిస్తూ హాస్పిటల్లో చేరే చైన్ స్నాచర్ పాత్రలో వెన్నెల కిషోర్.. హాస్పిటల్లో గది తీసుకుని అక్కడే నెలలుగా ‘బిజినెస్’ నడిపించే జగత్ కంత్రీగా సప్తగిరి. రోగుల మెడిసిన్ తో డబ్బు సంపాదించే కాంపౌండర్ పాత్ర.. ఈ ముగ్గురినీ దర్శకుడు సరిగ్గా వాడుకుని కామెడీ పండించాడు. హీరో నవీన్ కూడా వాళ్లలో ఒకడిగా మారిపోయి కామెడీ పండించడానికి సిన్సియర్ గా కృషి చేశాడు. నవీన్-సప్తగిరి-వెన్నెల కిషోర్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తూ సాగుతాయి.
హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో అంత విశేషం ఏమీ లేదు కానీ.. అది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. అది అబ్ రప్ట్ గా ఎండ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కానీ.. దానికి చివర్లో జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు. ఇక కథపై కాన్సెంట్రేట్ చేయాల్సిన టైంలోనూ దర్శకుడు కామెడీనే నమ్ముకున్నాడు. పైగా లెంగ్త్ కూడా ఎక్కువైపోవడంతో ద్వితీయార్ధం గాడి తప్పింది. నిజానికి ఈ కథకు అలాంటి ముగింపు ఉంటుందని ఊహించలేం. ఓవరాల్ గా చూస్తే ‘నందిని నర్సింగ్’ లోపాలున్నప్పటికీ వాటిని వినోదం కవర్ చేస్తుంది.
నటీనటులు: ‘నందిని నర్సింగ్ హోం’ సినిమాలాగే నవీన్ కూడా సింపుల్ గా కనిపించాడు. నవీన్ నటన పరంగా చూసినా ఇది అతడి తొలి సినిమా లాగా అనిపించదు. రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నవాడిలా మెచురిటీ చూపించాడు. ఇంట్రడక్షన్లో కానీ.. సినిమాలో మరెక్కడా కానీ.. కొత్త హీరోకిచ్చే అనవసర బిల్డప్పుల కోసం ప్రయత్నించకుండా తను ఆకట్టుకుంటాడు. లుక్స్ ఏవరేజే కానీ.. నవీన్ నటన మాత్రం మెప్పిస్తుంది. హీరోయిన్లు సినిమాకు ఆకర్షణ కాలేకపోయారు. హీరోను డామినేట్ చేయకూడదనుకున్నారో ఏమో.. ఇద్దరూ వీక్ హీరోయిన్లనే పెట్టారు. శ్రావ్య.. నిత్య లుక్స్ పరంగా పెద్దగా ఏంలేరు. వెన్నెల కిషోర్.. సప్తగిరి.. షకలక శంకర్ ముగ్గురూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం: సంగీతం ఫర్వాలేదనిపించింది. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఏవేరేజ్. కథ ఇక్కడే సాగుతోంది అని చెప్పడానికి పదే పదే నర్సింగ్ హోం లాంగ్ షాట్ చూపించడం లాంటివి అనవసరం అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమంత గొప్పగా లేవు. ఏదో చిన్న సినిమాకు, షార్ట్ ఫిల్మ్ కు లైటింగ్ ఉన్నట్లే దీంట్లో లైటింగ్ కనిపించింది. తక్కువ ఖర్చులో.. పరిమితమైన లొకేషన్లలో సినిమాను ముగించేశారు. పి.వి.గిరి దర్శకుడిగా సినిమాను బాగానే చేశాడు. ముఖ్యంగా కామెడీ విషయంలో అతడికి పట్టుందన్న సంగతి చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. కామెడీ సీన్స్ చూస్తే దర్శకుడు కొత్త వాడన్న అభిప్రాయమే కలగదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది. కానీ ఒక కొత్త హీరోతో ఈ మాత్రం టైంపాస్ చేయించి బోర్ కొట్టించనందకు దర్శకున్ని అభినందించాలి.
ఫైనల్ గా: నందిని నర్సింగ్ హోం.. టైంపాస్ మూవీ.. అస్సలు బోర్ కొట్టదు
రేటింగ్- 2.5/5