
కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా ప్రముఖులు మృతువాత పడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఇటీవల కొన్ని చేదు సంఘటనలు చూశాం. తాజాగా టాలీవుడ్ నిర్మాత కొమర వెంకటేష్ తుదిశ్వాస విడిచారు.
కొమర వెంకటేష్ కి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కొమర వెంకటేష్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దీనితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొమర వెంకటేష్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
కొమర వెంకటేష్ మరణించిన విషయాన్ని టాలీవుడ్ నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించింది. వెంకటేష్ ప్రకాశం జిల్లాలోని మాచర్లకి చెందినవారు. టాలీవుడ్ లో ఆయన జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ గా కెరీర్ ప్రారంభించారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా పలుమార్లు విజయం సాధించారు. అలాగే చిత్ర పురి కాలనీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
కొన్ని చిత్రాలని కూడా ఆయన నిర్మించారు. 2015లో విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ షేర్ చిత్రాన్ని నిర్మించింది ఆయనే. కొమర వెంకటేష్ అకాల మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన సన్నిహితులు, ప్రముఖులు కొమర వెంకటేష్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.