చావు అంచు వరకు వెళ్లి వచ్చాః కరోనా అనుభవాలు పంచుకున్న `నాగిని` ఫేమ్‌ కాజల్‌ పైజల్‌

By Aithagoni RajuFirst Published Apr 21, 2021, 7:42 PM IST
Highlights

ఇటీవల కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. మన దేశంలో దాదాపు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల కాజల్‌ పైజల్‌ కరోనా బారిన పడ్డారు. 

కరోనాతో అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నానని, దాదాపు చావు అంచు వరకు వెళ్లి వచ్చానని చెబుతోంది `నాగిని` నటి కాజల్‌ పైజల్‌. హిందీలో `నాగిని`5 టీవీ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్‌ పైజల్‌. ఇటీవల కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. మన దేశంలో దాదాపు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల కాజల్‌ పైజల్‌ కరోనా బారిన పడ్డారు. చాలా సీరియస్‌గా కరోనా వచ్చిందని, చాలా ఇబ్బంది పడినట్టు తెలిపింది కాజల్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకుంది.

`నా జీవితంలో అత్యంత దుర్భర క్షణాలు అంటే కరోనాతో పోరాడటమే. ప్రారంభంలో కొద్దిగా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వెళ్లి టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. అయితే అప్పుడు మరి అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. నా డాక్టర్‌ కూడా నేను త్వరగానే కోలుకుంటానని తెలిపింది. ఓ నెల రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులంతా నాకు ధైర్యం చెప్పారు. వారం, రెండు వారాల్లో అంతా సెట్‌ అవుతుందన్నారు. దీంతో నేను కూడా ధైర్యంగానే ఉన్నా. 

కానీ అనుకున్నట్టు జరగలేదు. రోజులు గడుస్తున్న కొద్ది నా ఆరోగ్యం మరింత క్షీణించింది.  కొద్ది రోజుల తర్వాత నాకు విపరీతంగా తల తిరిగేది. నా శరీరం మీద నేను అదుపు కోల్పోతున్నట్లు అనిపించేది. అది చాలా భయంకర అనుభవం. ఎంతో నిరాశకు గురయ్యేదాన్ని. ఒకానొక సమయంలో మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాను` అని కాజల్‌ పైజల్‌ తెలిపింది. తనకిది మరో జీవితమని చెప్పకనే చెప్పింది. కరోనాతో ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొందో చెప్పింది దాన్ని తీవ్రత  ఎలా ఉందో వెల్లడించింది. 

ఆమె ఇంకా చెబుతూ, `అభిమానుల ప్రార్థనలు, దేవుడి దయ, వైద్యులు, కుటుంబ సభ్యుల మద్దతుతో కోలుకున్నాను. కోవిడ్‌ నెగిటివ్‌ అని తేలింది. కానీ ఇప్పుడు కూడా చాలా నీరసంగా ఉంటుంది. డిప్రెషన్‌కు గురవుతున్నా. ఈ సందర్భంగా నా అభిమానులకు ఓ విన్నపం. కోవిడ్‌ను తేలికగా తీసుకోకండి. క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది కదా అనుకోకండి. అదేంత నరకమో అనుభవించిన వారికే తెలుస్తుంది. నిజంగా ఇది ఒక భయానక పీడకల. నా జీవితంలో ఇన్ని రోజులు మంచానికే అంకితం అవుతానని, ఇంతగా నీరసించిపోతానని ఊహించలేదు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి` అని వేడుకుంది. 

click me!