జగన్, చిరంజీవి భేటీపై నాగార్జున ఆసక్తికర కామెంట్.. ఒక్క మాటలో ఏం చెప్పారంటే..

By Sumanth KanukulaFirst Published Jan 15, 2022, 12:48 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మధ్య ఇటీవల జరిగిన భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భేటీకి సంబంధించి ప్రముఖ హీరో నాగార్జున (Nagarjuna) స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మధ్య ఇటీవల జరిగిన భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం చోటుచేసుకన్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలోనే కాకుండా, పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా విపరీతమైన చర్చ సాగుతుంది. అయితే తాజాగా జగన్, చిరంజీవి భేటీపై ప్రముఖ హీరో నాగార్జున (Nagarjuna) స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన నాగార్జున.. ‘చిరంజీవి వెళ్లారంటే తప్పకుండా హ్యాపీ ఎండింగ్ వస్తుంది’ అని చెప్పారు. 

ఇక, రెండు రోజుల క్రితం కూడా ఇదే అంశంపై స్పందించిన నాగార్జున.. మొత్తం సినీ పరిశ్రమ అందరి కోసమే జగన్‌తో చిరంజీవి మాట్లాడటానికి వెళ్లారని చెప్పారు. జగన్‌కు చిరంజీవి అంటే ఇష్టమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల గురించి తాను చిరంజీవి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటామని నాగార్జున చెప్పారు. చిరంజీవి తనకు ఫోన్ చేసి సీఎం జగన్‌ను కలవబోతున్నట్టుగా చెప్పారని నాగార్జున తెలిపారు. కానీ బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఉండటంతో రావటం కుదరదని చెప్పినట్టుగా వెల్లడించారు. ఈ భేటీతో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.

ఇదిలా ఉంటే గురువారం.. తాడేపల్లిలో సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు తాను సీఎం జగన్ పిలుపుమేరకు వచ్చి కలిసినట్టుగా సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించానని తెలిపారు. సినీ పరిశ్రమకు ఒక బిడ్డగానే తానిక్కడికి వచ్చానని అన్నారు. సీఎం సానుకూలంగా తాను చెప్పిన సమస్యలను విన్నారని.. తర్వలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. దీంతో సినీ పరిశ్రమతో పాటుగా, చాలా మంది గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదంపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.

అయితే తర్వాత చిరంజీవికి జగన్‌ రాజ్యసభ ఆఫర్ చేశారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన చిరంజీవి..తనకు రాజ్యసభ సీటు అనే మాట స్పెక్యులేషన్ మాత్రమేనని చెప్పారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ‘తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దని కోరారు. ఈ వార్తలకి పుల్ స్టాప్ పెట్టమని కోరుతన్నట్టుగా చెప్పారు.

click me!