
టాలీవుడ్‌లో రీ రిలీజ్ ల ట్రెండ్ పీక్ కి చేరుతుంది. సమయం, సందర్భం లేకుండా రీ రిలీజ్‌లు చేసే స్థాయికి వెళ్లిపోయింది. అదే సమయంలో హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో రెండు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. అందులో ప్రభాస్ `యోగి`, నాగార్జున `మన్మథుడు` చిత్రాలున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `యోగి` మూవీ మరో రెండు రోజుల్లో రాబోతుంది. ఆగస్ట్ 18న ఈ చిత్రం విడుదల కానుంది.
ఇక నాగార్జున నటించిన `మన్మథుడు` సినిమా ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ 29న `మన్మథుడు` చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్టు అన్నపూర్ణ స్టూడియో ప్రకటించింది. `మన్మథుడు` నాగార్జున కెరీర్‌లో ఒక బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటి. అంతేకాదు రొమాంటిక్ లవ్ స్టోరీలోనూ ఓ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన చిత్రం. ఈ మూవీతోనే నాగ్‌కి `మన్మథుడు` అనే ట్యాగ్‌ని వేశాడు ఆడియెన్స్.
కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ, మాటలు రాయడం విశేషం. నాగార్జున నిర్మించారు. ఆయన సరసన సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో లవ్ ట్రాక్‌తోపాటు కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. నాగార్జున, బ్రహ్మానందంల మధ్య కామెడీ నవ్వులు పూయిస్తుంది. అదే సమయంలో సోనాలి బింద్రే, నాగ్ మధ్య రొమాన్స్ తోపాటు కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. 2002 డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది. దాదాపు 21ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని నాగార్జున బర్త్ డే కానుకగా ఆగస్ట్ 29న రీ రిలీజ్ చేయడం విశేషం.
ఇక ప్రభాస్ నటించిన చాలా సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే `రెబల్` మూవీని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. అయితే `యోగి` మూవీ అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం పెద్దగా మెప్పించలేదు. ఇందులో మదర్ సెంటిమెంట్ పండినా, కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ఇక ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా, ఇందులో ప్రభాస్‌కి జోడీగా నయనతార నటించింది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2007 జనవరి 14న విడుదలైంది. ఈ శుక్రవారం రీ రిలీజ్‌తో మళ్లీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి ఇప్పుడు ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.