
మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) రంగంలోకి దిగారంటే అది రచ్చ రచ్చే. అవతలి వ్యక్తి ఎవ్వరనేది పట్టించుకోరు. ప్రశ్నల వర్షం, విమర్శల వర్షం కురిపిస్తారు. నిర్మొహమాటంగా తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. తాజాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన `భీమ్లా నాయక్`(Bheemla Nayak) చిత్రంపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలపై ఆయన స్పందించారు. ఏపీ ప్రభుత్వం పవన్‌పై కక్ష్య సాధిస్తుందని, అందుకే `భీమ్లా నాయక్` చిత్రాన్ని తొక్కేయాలని చూస్తుందని విమర్శలు గుప్పించారు. అదే సమయంలో `భీమ్లా నాయక్` సినిమాకి అన్యాయం జరుగుతుంటే పెద్ద హీరోలు, స్టార్‌డైరెక్టర్స్ , నిర్మాతలు ఒక్కరు కూడా ఇది కరెక్ట్ కాదని మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు.
ఈ మేరకు శనివారం సాయంత్రం నాగాబాబు ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, `రిపబ్లిక్` ఫంక్షన్ లో పవన్ ఇండస్ట్రీ తరఫున మాట్లాడారు. తన కోసం పరిశ్రమపై ఆంక్షలు విధించొద్దన్నాడని, అవసరమైతే తన సినిమాలు ఆపుకోమని చెప్పాడని, ఇదంతా ఇండస్ట్రీ కోసం చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పవన్ నటించిన `భీమ్లా నాయక్`పై కక్ష్య సాధిస్తుందని, దాన్ని తొక్కేయాలని చూస్తుందని చెప్పారు. తనపై కోసం ఉంటే తనసినిమాలు ఆపుకోవాలని అన్నందుకు ఇంత పని చేస్తావా అంటూ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు నాగబాబు. అయితే దీనిపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదని, ఒక్క హీరో కూడా పవన్ కి అనుకూలంగా మాట్లాడలేదని వాపోయారు.
ఓ హీరో సినిమాని కావాలని అన్యాయంగా తొక్కేస్తోంటే, ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలూ ఉన్నా ఒక్కరూ స్పందించకపోవడం దారుణమన్నారు. చంపేస్తారని భయమా? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు `మీ భయాల్ని, బలహీనతల్నీ మేం అర్థం చేసుకుంటాం. రేపు మీ సినిమాకి సమస్య వస్తే కల్యాణ్ బాబు ముందుంటాడు. ఎందుకంటే మీలా కల్యాణ్ భయస్తుడు కాదు` అంటూ హీరోలకు, దర్శక, నిర్మాతలు చురకలంటించారు నాగబాబు. అగ్ర హీరో సినిమాకే ఇంతటి అన్యాయంజరుగుతుంటే చిన్న సినిమాల పరిస్థితేంటో అర్థం చేసుకోవాలన్నారు.
`భీమ్లా నాయక్` సినిమా హిట్టయ్యింది కాబట్టి సరిపోయిందని, లేదంటే నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు నాశనం అయిపోయేవారని, ఈ సినిమా ఫ్లాపయినా పవన్ కి నష్టం లేదని, ఓ సినిమా తీసి, పదిమందికీ ఉపాధి కల్పించాలన్న నిర్మాత మాత్రం దారుణంగా నష్టపోయేవాడని.. ఈపరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వాన్ని నియంతతో పోల్చారు. నియంతలా ఇక్కడ పాలన సాగించాలనుకుంటే మన దేశంలోని ప్రజాస్వామ్యం ఒప్పుకోదని, ఐదేళ్లనాడు మళ్లీ జనం వద్దకివెళ్లాలని, వారి ఓట్ల కోసం పాట్లు పడాలని, మళ్లీ మీకు ఆ అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు నాగబాబు. ఐదేళ్లనాడు ప్రజలు బుద్ది చెబుతారనే విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు.