
మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కి వెన్నుదన్నుగా ఉంటున్నారు. నాదెండ్ల మనోహర్ తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాల్ని చూసుకుంటోంది నాగబాబే. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఒక ఊపు ఊపుతోంది.
పవన్ కళ్యాణ్, మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల చిత్రాలు రీ రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. తాను రీరిలీజ్ చేసిన చిత్రాల ఆదాయాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తానని నాగబాబు గతంలో ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా నాగబాబు.. గుడుంబా శంకర్ చిత్రం రీ రిలీజ్ చేయడం ద్వారా వచ్చిన ఆదాయంలో అధిక భాగాన్ని జనసేన పార్టీకి అందించారు. రూ.35 లక్షల చెక్ ని నాగబాబు జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ కి అందించారు.
ఈ దృశ్యాలని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో నాగబాబు తన నిర్మాణంలో తెరకెక్కిన రాంచరణ్ ఆరెంజ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఆ చిత్ర రీ రిలీజ్ లో వచ్చిన ఆదాయంలో 1.05 కోట్లు నాగబాబు జనసేనకి ఇచ్చారు.
అలాగే జల్సా చిత్ర రీరిలీజ్ అమౌంట్ ని కూడా జనసేనకు అందించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఈ మొత్తం ఉపయోగపడాలని నాగబాబు కోరారు.