
గత కొంతకాలంగా నాగశౌర్య కెరీర్ పరిస్దితి ఏమీ బాగోలేదు. యావరేజ్ సినిమాలు కూడా పడటం లేదు. ఓటిటిలతో ఓ మాదిరి హీరోలు సైతం బిజీగా ఉన్న టైమ్ లో నాగశౌర్య సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన చేస్తున్న ఫ్యామిలీ డ్రామాలు, ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీలు నడవటం లేదు. అలాగని మార్చి యాక్షన్ సినిమాలు చేస్తే అవీ అంతంత మాత్రమే అన్నట్లు ఉంది. ఎప్పుడో కెరీర్ మొదట్లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘చలో’ సినిమాలే సాలిడ్ హిట్స్ గా కనపడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘రంగబలి’ సైతం కెరీర్ ని బలి చేసి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఓ పంచాయితీలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.
రంగబలి సినిమా తర్వాత మొదలెట్టిన ఓ సినిమా షూటింగ్ సగంలోనే ఆగిపోయింది. డైరక్టర్ కు ,నిర్మాతలకు మధ్య పొసగటం లేదని వినికిడి. నిర్మాతలు ఎన్నారైలు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై 12 రోజులు షూటింగ్ జరిపి 12 కోట్లు దాకా ఖర్చు పెట్టారట. కేవలం షూటింగ్ నిమిత్తమే కాకుండా సినిమా ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ అడ్వాన్స్ లు, లొకేషన్స్ అన్ని కలిపి అంత అయ్యిందిట. అయితే ఇప్పుడు సినిమా ఆగింది కాబట్టి వేరే నిర్మాతను నాగశౌర్య తీసుకొచ్చారట.
అయితే ఇప్పుడు తాము ఖర్చు పెట్టిన సొమ్ము వెనక్కి ఇచ్చేసి సినిమా కంటిన్యూ చేసుకోమని ఎన్నారై నిర్మాతలు కోరుతున్నారట. అయితే అంత ఖర్చు ఎందుకయ్యింది. ఇంకా సినిమా చాలా పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ 12 కోట్లు ఇచ్చేస్తే మిగతా సినిమా ఏమి పెట్టి తీయాలి...బడ్జెట్ పెరిగితే తర్వాత ఆ స్దాయి బిజినెస్ అవుతుందా వంటి విషయాలు ఛాంబర్ లో డిస్కషన్స్ జరుగుతన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.
మరో ప్రక్క సరదాగ సాగే ఫ్యామిలీ, రొమాంటిక్, ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లైనా నాగశౌర్యకు చక్కగా సరిపోతాయి. ఈ తరహా సినిమాలతోనే నాగశౌర్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ సారి ఓ కొత్త జానర్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ అవి అనుకున్న రీతిలో సక్సెస్ అవ్వలేదు దాంతో నాగశౌర్య ఎలాగైనా హిట్ కొట్టాలని ఉన్నారు. చాలా కథలు వింటున్నారు. అయితే ఎలాంటి కథ ఎంచుకోవాలనే విషయమై తర్జన భర్జనలు పడుతున్నారట. రంగబలి దర్శకుడుతోనే మరో సినిమా చేయాలని అనుకున్నారని తెలుస్తోంది. సొంత బ్యానర్ పైనే ఈ సినిమా చేసే అవకాసం ఉందంటున్నారు.