కరోనాపై అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ములు కరోనా అవగాహన కల్పించేందుకు సరికొత్త చాలెంజ్ తెర మీదకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ హీరో నాగచైతన్య కరోనా జయించిన నర్సును ఇంటర్వ్యూ చేశాడు.
దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపు మేరకు కరోనా అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు హీరో నాగచైతన్య. సాజయా కాకర్ల, దీప్తి లతో కలిసి ఆయన కొవిడ్ విజేత సునీత, సామాజిక కార్యకర్త జలాల్ తో మాట్లాడారు. కొవిడ్ పట్ల సమాజంలో ఉన్న అపోహలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై నాగ చైతన్య చర్చించారు. శుక్రవారం సాయంత్రం ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ చర్చ జరిగింది.
నాగచైతన్య మాట్లాడుతూ.. `మార్చి నెల మొదట్లో మన దగ్గరకు వైరస్ వచ్చింది. ఆ తర్వాత అనేక రకాల సమాచారాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ గందరగోళం క్రియేట్ చేశాయి. ప్యానిక్ పరిస్థితి, భయం తీసుకొచ్చాయి. వైరస్ ను ఎదుర్కొవాలంటే మనమంతా ఒక్కటవ్వాలి. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు. అందరిదీ. దీన్ని అంతా ఎదుర్కొవాల్సిందే. వైరస్ ఉందని మీలోనే దాచుకుంటే అది మొదటి స్టేజి నుంచి చివరి స్టేజ్ కు వెళ్తుంది.
undefined
కాబట్టి లక్షణాలు ఉన్నాయని అనిపించిన వెంటనే వైద్య సాయానికి వెళ్లాలి. ఇప్పుడు అనేక చోట్ల కరోనా చికిత్సలు చేస్తున్నారు. వైరస్ ఉంటే బయటకు చెప్పండి. కొవిడ్ నుంచి కోలుకున్నాక దాని గురించి మీ అనుభవాలు ప్రచారం చేయండి. అలాగే ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రండి. అలా చేయడం వల్ల మీరు చాలా మంది జీవితాలు కాపాడగల్గుతాం` అన్నారు.
కొవిడ్ విజేత సునీత మాట్లాడుతూ... `నేను ప్రభుత్వ హెల్త్ సెంటర్లో నర్సును, మాది మహబూబ్ నగర్ జిల్లా. కొవిడ్ డ్యూటీలో భాగంగా జూన్ 6న సరోజినీ దేవీ ఆస్పత్రిలో విధులకు చేరాను. జూన్ 12 నుంచి నాలో అనారోగ్యం మొదలైంది. టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. మొత్తం 28 రోజులు ఒక్కదాన్నే ఇంట్లో ఉంటూ మందులు వాడుతూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నాను. వ్యాయామాలు చేశాను. పసుపు, తులసి, కొబ్బరి నీళ్లు వంటి ఆహారం నాకు హెల్ప్ చేసింది. ఆరోగ్యంగా తిరిగి విధుల్లోకి చేరాను. నా అనుభవం చెప్పాలంటే ధైర్యంగా ఉండాలి. భయపడితే సమస్య పెరుగుతుంది. వైద్యులు చెప్పినట్లు మందులు వాడాలి. వ్యాయామం, ఎండలో ఉండి ఇమ్యూనిటీ పెంచుకోవాలి` అన్నారు.