Nadigar Sangam Election Result:నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు...విజయఢంకా మోగించిన విశాల్ ప్యానెల్

Sambi Reddy | Published : Mar 20, 2022 9:00 PM
Nadigar Sangam Election Result:నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు...విజయఢంకా మోగించిన విశాల్ ప్యానెల్

దాదాపు మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల చేశారు. మరోసారి విశాల్ నేతృత్వంలోని ప్యానల్ సభ్యులు విజయ ఢంకా మోగించింది.

దక్షిణ భారత నటీనటులు సంఘం (నడిగర్‌) ఎన్నికల ఫలితాలు(Nadigar Sangam Election Result) ఎట్టకేలకు వెలువడ్డాయి. 2019లో నడిగర్‌  సంఘం ఎన్నికలు జరిగాయి. ఒక ప్యానల్‌ నుంచి నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్‌ సెక్రటరీగా పోటీ చేశారు. మరో ప్యానల్‌ నుంచి అధ్యక్షుడిగా భాగ్యరాజ్‌, సెక్రటరీగా గణేశన్‌ బరిలో దిగారు. ఓటింగ్‌లో విశాల్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడంతో మద్రాస్‌ కోర్టు కౌంటింగ్‌ను నిలిపేసింది. తాజాగా విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్‌ జరిపారు. ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా నాజర్‌ రెండోసారి గెలుపొందారు.  ప్రధాన కార్యదర్శిగా విశాల్‌, ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించారు. 

నడిగర్ సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఒక తెలుగువాడు నడిగర్ సంఘానికి నేతృత్వం వహించకూడదంటూ భాగ్యరాజ్, భారతీ రాజా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల విషయంలో శరత్ కుమార్, రాధిక కూడా విశాల్ (Vishal)పై ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని భాగ్యరాజ్ ప్యానెల్ మెంబర్స్ కోర్టును ఆశ్రయించారు. దాదాపు మూడేళ్ళుగా ఎన్నికల ఫలితాలపై తీర్పు రాలేదు. ఎట్టకేలకు నేడు వెలువడింది. 

నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణంతో పాటు పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన విశాల్ కి తమిళ నటుల్లో చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. నాజర్, కార్తీ వంటి నటులు ఆయనకు వెన్నంటి ఉన్నారు. విశాల్ ప్యానల్ కి అనుకూలంగా ఫలితాలు రావడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

click me!