
'కంచె' చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు చిరంతన్ భట్. ఈ సినిమా తరువాత బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి','జై సింహా' వంటి సినిమాలకు సంగీతం అందించాడు. క్రిష్ రూపొందించనున్న 'ఎన్టీఆర్' బయోపిక్ కు కూడా చిరంతన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో చిరంతన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ట్వీట్ చేశాడు.
శాతకర్ణి సినిమాకు నేను మంచి సంగీతాన్ని ఇవ్వలేదేమో..? అనే అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టాడు. దానికి కారణం.. 65వ ఫిలిం ఫేర్ అవార్డుల్లో పలు విభాగాల్లో 'శాతకర్ణి' సినిమా పోటీ పడుతుంది కానీ సంగీతం, సాహిత్యం కేటగిరీల్లో మాత్రం నామినేషన్లు దక్కలేదు. దీంతో చిరంతన్ ''సంగీతం, సాహిత్యం విభాగాల్లో తప్ప శాతకర్ణి చిత్రానికి చాలా విభాగాల్లో నామినేషన్లు వచ్చాయి. బహుసా నేను సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఇంకా ఎక్కువ కష్టపడి పని చేయాలి'' అని ట్వీట్ చేయగా.. తడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్రిష్.
''సిరివెన్నెల గారు.. మీరు.. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, రచయిత సాయి మాధవ్ బుర్రా శాతకర్ణి సినిమాకు మూలస్తంభాలు. మీ సహకారం కారణంగానే మిగిలిన వారికి నామినేషన్స్ వచ్చాయని'' క్రిష్ అన్నారు.