
పెరిగిన సినిమా టికెట్ ధరలపై చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతూనే ఉంది. థియేటర్ వ్యవస్థని బతికించేందుకు సినిమా టికెట్ ధరలు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. అనేక కారణాల వల్ల ఇటీవల జనాలు థియేటర్స్ కి వెళ్లడం తగ్గించారు. ముఖ్యంగా మధ్యతరగతి ఫ్యామిలీ థియేటర్ లో సినిమా చూడాలంటే పెను భారంగా మారుతోంది.
ఓటిటి ఎఫెక్ట్ కూడా బాగా పెరిగింది. ఇలాంటి సమయంలో ప్రేక్షకులని ఆకర్షించేందుకు మల్టీ ఫ్లెక్స్ అసోసియేషన్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16న ఇండియన్ సినిమా డే సందర్భంగా ప్రేక్షకులకి బంపర్ ఆఫర్ ప్రకటించారు.
సెప్టెంబర్ 16న ఇండియా వ్యాప్తంగా ఉన్న దాదాపు 4000 మల్టీఫఫ్లెక్స్ స్క్రీన్స్ లలో సినిమా టికెట్ ధరని రూ.75కే అందించనున్నారు. ఈ మేరకు మల్టిఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఏఐ) ట్వీట్ చేసింది. లాక్ డౌన్ తర్వాత మరోసారి సినిమా థియేటర్ వ్యవస్థని ఆదరిస్తున్న సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఈ ఆఫర్ ని అమలు చేయబోతున్నట్లు ఎంఏఐ ప్రకటించింది.
దేశంలోని ప్రధాన మల్టిఫ్లెక్స్ సంస్థలు పీవీఆర్, కార్నివాల్, సినీపోలిస్, ఐనాక్స్, సిటీ ప్రైడ్ ఈ ఆఫర్ అందించబోతున్నాయి. ఈ ఒక్కరోజు ఆఫర్ వల్ల జనాలు మరోసారి థియేటర్స్ పట్ల ఆకర్షితులు అవుతారు అని మల్టిఫ్లెక్స్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.