
గత కొద్ది రోజులుగా మంచు విష్ణు మీద నెట్టింట్లో జరిగే ట్రోలింగ్ ఏ స్దాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన భాష, హావా భావాలపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీతో పోల్చుకుంటూ.. తమని ఇండస్ట్రీ పెద్దలుగా భావిస్తూ ప్రేక్షకులకి ఇచ్చే కంటెంట్ కోసం అయితే ట్రోలర్స్ వెయిటింగ్ లో ఉంటారు. ఎప్పుడు మంచు విష్ణు ట్వీట్ చేసినా, మీడియా ముందుకొచ్చి మాట్లాడినా ఆ రోజు వారికి పండగే. ఎప్పటికప్పుడు మంచు విష్ణు పెట్టిన ట్వీట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
‘కందుకూరి వీరేశలింగం పంతులు పేరుని కందుకూరి వీరేహం పకాహం’ అని పలకటం.. ‘ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాడుకుని ఉంటే నేను ఇండియాలోనే నంబర్ ఒన్ హీరో అయి ఉండేవాడిని’.. ‘లెట్ దెమ్ నో అంకుల్.. లెట్ దెమ్ నో..’ వంటి డైలాగ్స్ తో మంచు విష్ణు లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇక అప్పటి నుండి ట్రోలింగ్ బ్యాచ్ లో విష్ణుపై ఫోకస్ పెరిగింది.
రీసెంట్ గా సీఎం జగన్ తో చిరంజీవి నేతృత్వంలో జరిగిన భేటీకి మంచు హీరోలకి ఆహ్వానం దక్కలేదు. అయితే ప్రతి విషయంలో మెగా ఫ్యామిలీతో పోల్చుకునే మంచు విష్ణు.. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఒక ట్వీట్ పెట్టాడు. వైసీపీ మంత్రి పేర్ని నాని తమ ఇంటికి వచ్చి మరి చర్చల్లో జరిగిన సంగతులని వివరించాడని ట్వీట్ చేశాడు మంచు విష్ణు. అంతే సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ట్రోలింగ్. ఈ నేపధ్యంలో మోహన్ బాబు స్పందించారు. తన తాజా చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ...ఈ విషయమై చర్చకు చర్చ లేపారు.
‘‘ట్రోలింగ్, వ్యంగంగా వచ్చే మీమ్స్ చూసి చాలా బాధపడుతున్నా. అసలు వాటిని దృష్టిలోకి తీసుకోవలసిన అవసరం లేదు కానీ.. మనిషిగా పుట్టినందుకు ఆత్మాభిమానం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడక తప్పదు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. తాజాగా ఆయన నటించిన ‘సన్ ఆప్ ఇండియా’ చిత్రం ఈ నెల 18న విడుదల కానున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
మోహన్ బాబు మాట్లాడుతూ... ‘‘ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ క్రియేషన్ చాలా బాధ కలిగిస్తుంది. ఎదుటి వ్యక్తిపై ట్రోలింగ్ చేయవచ్చేమో నాకు తెలీదు కానీ.. అందులో వ్యంగ్య దోరణి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. నేను మామూలుగా అయితే వాటిని చూడను. ఎవరన్నా పంపిస్తేనే చూస్తాను. అదే పని మీద కూర్చుని చేసేవాళ్లు కొందరున్నారు. వారికి అదే ఉద్యోగం.
ఇద్దరు హీరోలు 50, 100 మందిని అపాయింట్ చేసుకుని ఇలా ప్రతి ఒక్కరినీ ట్రోల్ చేయిస్తున్నారు. ఆ హీరోలు ఎవరో కూడా నాకు తెలుసు. ‘వినాశకాలే విపరీతబుద్ధి’ అన్నట్లు చెప్పినవాడు, చేసినవాడిని ప్రకృతి చూస్తోంది. తాత్కాలికంగా వారు బావుంటారు కానీ.. ఏదో ఒక రోజు వారు శిక్ష అనుభవిస్తారు. ఆ రోజున వారికి ఎవరు సాయపడరు. వెనుక ఎవరూ ఉండరు. ట్రోల్స్, మీమ్స్ సరదాగా నవ్వుకునేలా ఉండాలి కానీ.. ఎదుటివాడి పతనం కోరుకునేలా ఉండకూడదు’’ అని అన్నారు. ఈ నేపధ్యంలో ఇంతకీ ఎవరా హీరోలు, .పని గట్టుకుని అంత డబ్బు ఖర్చు పెట్టే హీరోలు ఎవరు...మెగా కాంపౌండ్ కు సంభందించిన వాళ్ళేనా . మోహన్ బాబు ఉద్దేశ్యం అంటూ మళ్లీ ట్రోలింగ్ మొదలైంది.