
దర్శకధీరుడు రాజమౌళి ఫోకస్ మొత్తం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రిలీజ్ పైనే ఉంది. పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీనితో రాంచరణ్, ఎన్టీఆర్ ని ఒకే ప్రేములో చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. దీనితో ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రాజమౌళి తదుపరి చిత్రం గురించి కూడా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని రాజమౌళి ఆల్రెడీ ప్రకటించేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ అంటే అంచనాలు తారా స్థాయిలో ఉండడం సహజం. తొలిసారి వీరిద్దరి కలయికలో మూవీ రాబోతోంది.
ఈ చిత్ర కథ ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నాను అని.. కథ ఇంకా ఫైనల్ కాలేదు అని విజయేంద్ర ప్రసాద్ గతంలో తెలిపారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ కు కుమార్తె వరుస అయ్యే గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఈ చిత్రం గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు.
విజేంద్ర ప్రసాద్ కథ రాస్తుండగా ఆయనతో ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్లో శ్రీలేఖ షేర్ చేసింది. మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్ రాజమౌళి అన్న, మహేష్ బాబు చిత్రానికి మీకు ఆల్ ది బెస్ట్. ఎంతగానో ఎదురుచూస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది.
ఈ ఫొటోలో విజయేంద్ర ప్రసాద్ టేబుల్ పై పెన్ను పేపర్ తో పాటు చెల్లా చెదురుగా ఉన్న కరెన్సీ నోట్లు కూడా కనిపిస్తున్నాయి. దీని ద్వారా ఏమైనా హింట్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా విజయేంద్ర ప్రసాద్.. మహేష్, రాజమౌళి చిత్ర కథ కోసం ఫుల్ బిజీగా ఉన్నారనేది అర్థం అయిపోయింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగానే కథ ఏంటి, ఇతర విషయాలపై క్లారిటీ రానుంది.