తన అద్భుతమైన గాత్రంతో అలరిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ 2 సింగర్ చిన్నారి అయాన్ ప్రణతికి గాత్రానికి మెగాస్టార్ ఫిదా అయ్యారు. దీంతో చిరంజీవి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
అద్భుతమైన సింగర్స్ ని వెలికితీసే కార్యక్రమం ఇండియన్ ఐడల్ తరహాలో తెలుగు ఇండియన్ ఐడల్‌ని తీసుకొచ్చింది `ఆహా`(ఓటీటీ సంస్థ). ఇప్పటికే తొలి తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో పూర్తి చేసుకుంది. అద్భుతమైన, ప్రతిభావంతమైన సింగర్లని వెలికితీసింది. ఇటీవలే రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. ఇందులోనూ టాలెంటెడ్ సింగర్స్ బయటకు వస్తున్నారు. అలా అయాన్ ప్రణతి అనే 14ఏళ్ల చిన్నారి అద్భుతమైన గాత్రంతో అందరిని ఆకట్టుకుంటుంది. తన గాన మాధుర్యంతో శ్రోతలను, షో జడ్జ్ లను సైతం అలరిస్తుంది. అంతేకాదు ఈ అమ్మాయి పాటకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే ఫిదా కావడం విశేషం.
వైజాగ్‌కి చెందిన ఈ అయాన్ ప్రణతి గాత్రానికి చిరు సైతం ముగ్దుడయ్యారు. దీంతో వెంటనే ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిపించి అభినందించారు. చిరంజీవి, తన సతీమణి సురేఖ సమక్షంలో అన్నమాచార్య కీర్తణలను ఆలపింప చేశారు. చిన్నారి ప్రణతి అద్భుతంగా అన్నామాచార్య కీర్తణలను ఆలపించి వారిని ముగ్దుల్ని చేసింది. ఆద్యంతం అబ్బుర పరిచింది. దీంతో చిన్నారి పాటకు ఫిదా అయిన చిరు ప్రశంసలు కురిపించారు. అనంతరం తానే స్వయంగా ప్రణతితో సెల్ఫీ సైతం తీసుకున్నారు. ఇండియన్ ఐడల్ సీజన్2లో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో చిరు ముందుంటారు. మరోసారి ఆయన పెద్ద మనసుని చాటుకున్నారు.
చిరంజీవి తనని ఇంటికి పిలిపించి అభినందించడం పట్ల చిన్నారి సింగర్ అయాన్ ప్రణతి స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ ముందు పాట పాడే అవకాశం కల్పించిన చిరంజీవి, సురేఖలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇదంతా ఒక కలలా ఉందని, ఇండియన్ ఐడల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరించేందుకు మరింత ప్రేరణ పొందానని, చిరంజీవిని కలవడం తనలో మరింత నమ్మకం, ఆత్మ విశ్వాసం పెరిగిందని, ఆ స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతానని వెల్లడించింది. ఆ చిన్నారికి నెటిజన్లు, శ్రోతలు అభినందనలు తెలియజేస్తున్నారు.