
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. చిరు ఉద్యమకారుడిగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. ఈ పోస్టర్‌కు ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా మీద విమర్శలు కూడా ఎక్కువ అయ్యాయి. ఆచార్య కథ తమదే అంటూ కొంత మంది రచయితలు చిత్రయూనిట్ మీద ఆరోపణలు మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో ఆచార్య చిత్ర నిర్మాతలు కాపీ ఆరోపణలపై అధికారికంగా స్పందించారు. ఈ మేరకు ఓ వారు ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు. చిత్ర కథ కాపీ అంటూ ఆరోపణలు చేయటం పూర్తిగా నిరాధారం అంటూ కొట్టి పారేశారు. కేవలం మోషన్ పోస్టర్‌ను మాత్రమే చూసి కథ కాపీ అంటూ ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదని చెప్పారు. కొరటాల శివ లాంటి దర్శకుడి కథపై ఆరోపణలు చేసి ఆయన గౌరవాన్ని తగ్గించటం సరైన పద్దతి కాదని తెలిపారు.
ఆచార్య కథ పూర్తిగా కొరటాల శివ స్వయంగా రాసి, డైరెక్ట్ చేస్తున్నారని తెలిపారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో మెగా అభిమానులు ఆచార్య కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.