
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి ప్రధానపాత్రలో నటించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూటింగ్ నేటి (డిసెంబర్ 6) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాయలసీమ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ సిద్ధం చేశారు.
ఈ సెట్‌లో తొలి సన్నివేశాలను చిత్రీకరించి ప్రారంభించారు. చిరంజీవితో పాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్టుల మీద సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మేరకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రఫర్ రవివర్మన్ ‘సైరా’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో రత్నవేలును కెమెరామన్‌గా ఎంపిక చేశారు. కాగా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.తమన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
రూ.200 కోట్ల పైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘సైరా’లో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంజీవి సైరా కోసం మాంచి ఫిజిక్ వచ్చేలా బాడీ షేప్‌ను సంపాదించారు. ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు.