
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి అభిమానులని ఉర్రూతలూగించేందుకు 'వాల్తేరు వీరయ్య'గా వచ్చేస్తున్నారు. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ గెస్ట్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ పాత్రని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. చిరంజీవి స్వయంగా ట్విట్టర్ లో ఈ టీజర్ ని లాంచ్ చేశారు.
రవితేజ అభిమానులు కోరుకునే విధంగా మాస్ అప్పీల్ తో టీజర్ అదిరిపోయింది. ఈ చిత్రంలో రవితేజ ఎసిపి విక్రమ్ సాగర్ పాత్రలో నటిస్తున్నారు. 'ఫస్ట్ టైం ఒక మేకపిల్లని ఎత్తుకుని పులి వస్తోంది' అనే డైలాగ్ బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుండగా రవితేజ మాస్ ఎంట్రీ ఇచ్చారు.
భుజాన మేకపిల్లని ఎత్తుకుని గొడ్డలితో గ్యాస్ సిలిండర్ ని లాగుతూ వస్తున్న విధానం అదుర్స్ అంతే. 'ఏం రా వారి పిస పిస జేస్తున్నాం.. నీకింకా సమజ్ కాలే.. నేను ఇవ్వని అయ్యకి ఇననని' అంటూ రవితేజ తెలంగాణ స్లాంగ్ లో చెబుతున్న డైలాగ్ అద్భుతంగా ఉంది. మొత్తంగా డైరెక్టర్ బాబీ రవితేజని రూత్ లెస్ కాప్ గా ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్థం అవుతోంది.
అతని బ్యాగ్రౌండ్ కేవలం హార్డ్ వర్క్.. అతని సపోర్ట్ ప్రేమించే మాస్ అంటూ చిరంజీవి రవితేజ గురించి ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ సంక్రాంతికి చిరంజీవి, రవితేజ కలసి బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.