ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత

Manoj Kumar Death News: బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. 87 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలవల్ల ఆయన చనిపోయారు. 


Bollywood Actor Manoj Kumar Passes Away: ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ ఇక లేదు. ఈరోజు ఉదయం (ఏప్రిల్ 4, 2025) ఆయన ముంబయ్ లోని  ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 87 ఏళ్లు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా మనోజ్ కుమార్ మార్క్ చాలా ప్రత్యేకం. ఆయన  ఎక్కువగా   దేశభక్తి పాత్రలు పోషించినందుకు భారత్ కుమార్' అని ముద్దుగా  పిలుచుకునేవారు ఫ్యాన్స్. వృద్ధాప్యం వల్ల వచ్చిన సమస్యలతో పాటు, పలు ధీర్ఘకాలిక సమస్యలతో, ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన మనోజ్ కుమార్ నేటి ఉదయం 4:03 గంటలకు తుదిశ్వాస విడిచారు.

వైద్య నివేదికల ప్రకారం, గుండెపోటు రావడంతో కార్డియోజెనిక్ షాక్ వల్ల ఆయన చనిపోయారని తేలింది. గత కొన్ని నెలలుగా ఆయన లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నారని, దాని వల్ల ఆరోగ్యం క్షీణించించినట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 21, 2025న ఆసుపత్రిలో చేరారు. ఇక మనోజ్ సినిమా కెరీర్ గురించి చూస్తే.. ఆయన అసలు పేరు హరికృష్ణన్ గోస్వామి. జూలై 24, 1937న అమృత్‌సర్‌లో జన్మించి ఈ స్టార్ హీరో.. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత మనోజ్ కుమార్ గా తన పేరు మార్చుకున్నారు.  హిందీ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మనోజ్.

Latest Videos

షహీద్, ఉపకార్, రంగ్ దే బసంతి వంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు భారత ప్రజల దేశభక్తిని తట్టిలేపుతాయి. తన ఫిల్మ్  కెరీర్‌లో మనోజ్ కుమార్ దేశభక్తి, ఐక్యత స్ఫూర్తిని తెలిపే సినిమాల్లో ఎక్కువగా నటించారు. నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం, వివిధ విభాగాల్లో ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. భారతీయ కళలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. 2015లో భారతీయ సినిమాలో అత్యుత్తమ గుర్తింపు పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా మనోజ్ కుమార్ అందుకున్నారు.

ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు మనోజ్ కుమార్  సేవలను గుర్తు చేసుకుంటున్నారు. దర్శకుడు అశోక్ పండిట్ కూడా దిగ్గజ నటుడు మరణంపై విచారం వ్యక్తం చేశారు. ANIతో మాట్లాడుతూ, "లెజెండరీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మా స్ఫూర్తి, భారతీయ చలనచిత్ర పరిశ్రమ దిగ్గజం శ్రీ మనోజ్ కుమార్ గారు ఇకలేరు అని తెలియజేయడానికి బాధపడుతున్నాను. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణం  పరిశ్రమకు తీరని లోటు, మనోజ్‌జీ మిమ్మల్ని నిజంగా మిస్ అవుతున్నాం." అని అన్నారు. "మేమంతా అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తూ ఉండేవాళ్లం. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. పరిశ్రమ ఆయనను మిస్ అవుతుంది. ఆయనలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప నిర్మాత మన పరిశ్రమలో ఉండరు. గుడ్‌బై మనోజ్‌జీ, గుడ్‌బై." అని ఆయన అన్నారు. మనోజ్ కుమార్ తన సినిమాల ద్వారా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు.

click me!