Latest Videos

ఇళయరాజా లీగల్‌ నోటీసులు..రెస్పాండ్ అయిన "మంజుమ్మల్ బాయ్స్" నిర్మాత

By Surya PrakashFirst Published May 24, 2024, 5:03 PM IST
Highlights

ఇళయరాజా పంపిన లీగల్‌ నోటీసులపై మంజుమ్మెల్‌ బాయ్స్‌ నిర్మాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.


ఇళయరాజా తాజాగా మరో సూపర్ హిట్ సినిమాకు కూడా నోటీసులు పంపి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. నిజ జీవిత సంఘటన ఆధారంగా వచ్చిన ఈ సినిమా రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.   ఈ సినిమాలో 1991లో ఇళయరాజా- కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన గుణ చిత్రంలోని  కణ్మణి అన్బోడు పాటను ఉపయోగించారు. దాంతో.. తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన పాటను సినిమాలో వాడుకున్నందుకు మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు పంపారు ఇళయరాజా.

 కాపీరైట్ యాక్ట్ ప్రకారం కణ్మణి అన్బోడు పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందుతాయని, ఆయన అనుమతి లేకుండా పాటను సినిమాలో వాడే హక్కు ఎవరికీ లేదని, అందుకు పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

దీంతో ఇళయరాజా లీగల్‌ నోటీసుల వ్యవహారం మరోసారి చిత్ర పరిశ్రమలో వార్తల్లో నిలిచింది. ఈనేపథ్యంలో చిత్ర నిర్మాత షాన్‌ ఆంటోనీ స్పందించారు. ఓ న్యూస్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాపీరైట్‌ కలిగిన రెండు మ్యూజిక్‌ కంపెనీలను సంప్రదించి వారినుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు. అయితే, ఈ విషయంలో ఇళయరాజా వాదన మరోలా ఉంది. 

ఇళయరాజా ఏమంటారారంటే.... ఆ పాటకు మ్యూజిక్‌ కంపోజర్‌ కావడం వల్ల తనకే మొదటి ఓనర్‌ రైట్స్‌ ఉంటాయని అంటున్నారు. తన పనికి సంబంధించిన ప్రతీ మ్యూజిక్‌ బిట్‌పైనా హక్కులు తనకే చెందుతాయని చెబుతున్నారు. మంజుమ్మెల్‌ బాయ్స్‌ చిత్రబృందం తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.

 గతంలోనూ ఓ సినిమాలోని పాటను మరో సినిమాలో వినియోగించడంపై న్యాయపరంగా వాదోపవాదాలు నడిచాయి. మ్యూజిక్‌ కంపెనీలు ఎన్ని సంవత్సరాలైతే హక్కులు కలిగిఉంటాయో అన్నేళ్లు వాటికే చెందుతాయి తప్ప, ఆ పాటలను కంపోజ్‌ చేసిన సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా హక్కులంటూ ఉండవని న్యాయస్థానం ఓ సందర్భంలో అభిప్రాయపడింది.
 

click me!