`మా` ఎన్నికల బరిలో మంచు విష్ణు.. విలక్షణ నటుడితో ఢీ.. రసవత్తరంగా ఎన్నికలు

By Aithagoni RajuFirst Published Jun 21, 2021, 8:20 PM IST
Highlights

`మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌) ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగబోతున్నాయి. అధ్యక్ష పోటీలో మంచు విష్ణు, విలక్షణ నటుడు ప్రకాష్‌ పోటీ పడుతున్నారు. దీంతో `మా` ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.

`మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌` ఎన్నికల బరిలోకి మంచు మోహన్‌బాబు తనయుడు, మంచు విష్ణు దిగబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సూపర్‌ స్టార్‌ కృష్ణని కలిసి విషెస్‌ తీసుకున్నారు. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారట. పక్కా ప్రణాళికతోనే విష్ణు అడుగులు వేస్తున్నారు. 
తండ్రి, డా. మోహన్ బాబు ఆశీస్సులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారట.

'మా' సభ్యుల సంక్షేమం, 'మా'కి సొంత భవనం ఏర్పాటుకు కృషి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉంటే ఈ సారి `మా` ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ `మా` ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. దీంతో `మా` పోరు రసవత్తరంగా సాగబోతుందని అర్థమవుతుంది. ప్రకాశ్‌రాజ్‌కి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగనుండటం, 'మా' ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది. మరోవైపు ప్రకాశ్‌ రాజ్‌కి మెగాబ్రదర్‌ నాగబాబు సపోర్ట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇటీవల `మా` ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు ప్రకటించిన సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ, `సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా నేను కర్ణాటకలో ఆరు ప్రభుత్వ పాఠశాలను నడిపిస్తున్నా. మూడు ఊర్లను దత్తత తీసుకున్నా. ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా `మా` అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా సేవలు అందించగలననే నమ్మకం నాకుంది. సినిమాలో పాత్ర పండించడానికి ఎంతగా కష్టపడతామో ఈ బాధ్యతను అలాగే తీసుకుని ముందుకెళ్తా` అని అన్నారు.

ఇంకా చెబుతూ, `చిరంజీవి అందరి వ్యక్తి. వ్యక్తిగతంగా ఆయన ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని అనిపించిన వారికే మద్దతు ఇస్తారు. అన్నయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని దీని కోసం ఉపయోగించుకోనని చెప్పారు.  తెలుగు పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది. వాటిని పరిష్కరించడానికి సరైన ప్రణాళిక కూడా తన దగ్గర ఉంద`ని ప్రకాశ్‌ చెప్పారు. ఇతర పరిశ్రమలతో పోల్చితే తెలుగు పరిశ్రమ చాలా పెద్దదని, కాకపోతే ఒకప్పుడు ఉన్న పేరు ఇప్పుడు లేదన్నారు. 

దేశవ్యాప్తంగా `మా` అసోసియేషన్‌కు గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని, తాను అధ్యక్షుడు అయితే `మా`కు సొంత భవనం నిర్మిస్తానన్నారు. సినీ కళాకారులకు సాయం చేయడానికి పరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తానన్నారు ప్రకాష్‌ రాజ్‌. ఇదిలా ఉంటే 2019లో `మా` ఎన్నికలు జరిగాయి. అప్పుడు అధ్యక్షుడిగా వి.కె నరేష్‌ ప్యానెల్‌ విజయం సాధించింది. వి.కె. నరేష్‌పై ఆ మధ్య పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 
 

click me!