మహేష్ బాబు నివాసంలో చోరీకి యత్నం.. దొంగను పట్టుకున్న సెక్యూరిటీ గార్డ్.. అసలేం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published Sep 29, 2022, 11:14 AM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నివాసంలో ఓ ఆగంతకుడు చోరికి యత్నించాడు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నివాసంలో ఓ ఆగంతకుడు చోరికి యత్నించాడు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మహేష్ బాబు ఇంటి ప్రహరీ గోడ చాలా ఎత్తుగా ఉండటంతో..  గోడపై నుంచి దూకే క్రమంలో అతడు గాయపడ్డాడు. ఈ క్రమంలోనే అతడిని గుర్తించిన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. మహేష్ ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

అసలేం జరిగిందంటే.. మహేష్ బాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 81 లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి నిందితుడు మహేష్ ఇంటి ప్రహరీ గోడ దూకాడు. ఈ క్రమంలోనే పెద్ద శబ్దం రావడంతో మహేష్ ఇంటి సెక్యూరిటీ గార్డులు అప్రమత్తమయ్యారు. శబ్దం వచ్చిన వైపు వెళ్లిచూడగా.. ఓ వ్యక్తి గాయపడి కనిపించాడు. దీంతో వారు వెంటనే అతడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

అతడికి గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో అతడి పేరు కృష్ణ అని గుర్తించారు. ఒడిశా నుంచి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన అతడు.. మహేష్ ఇంటికి సమీపంలోని ఓ నర్సరీలో ఉన్నాడని విచారణలో తేలింది. మహేష్ నివాసంలో చోరికి యత్నించే సమయంలో 30 అడుగుల ఎత్తైన గోడపై నుంచి దూకడంతో అతడు గాయపడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. మహేష్ బాబు ఇంట విషాదం  చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి.. బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇందిరాదేవి మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీ ప్రముఖులు నాగార్జున, వెంకటేశ్, మోహన్‌బాబు, మురళీమోహన్, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, త్రివిక్రమ్, రానా.. తదితరులు ఇందిరాదేవి భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక, ఇందిరా దేవీ అంత్యక్రియలను బుధవారం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో నిర్వహించారు.
 

click me!