
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగులో ప్రధానంగా చాలా మంది సెలబ్రిటీలు కన్నుమూశారు. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యంగ్ డైరెక్టర్ కన్నుమూశారు. మాలీవుడ్ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్(31) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు.
డైరెక్టర్ జోసెఫ్ మరణంతో మాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేమ్స్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం `నాన్సీ రాణి` షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోనే దర్శకుడు మరణించడంతో చిత్ర బృందం షాక్‌కి గురవుతుంది. దీంతో దిక్కుతోచని స్థితిలో చిత్ర బృందం ఉండటం విచారకరం. జోసెఫ్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
జోసెఫ్ మను జేమ్స్ బాలనటుడిగానూ నటించి అలరించారు. గతంలో ఆయన `ఐ యామ్ క్యూరియస్` చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. 2004లో ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన పలు మలయాళ, హిందీ, కన్నడ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు `నాన్సీ రాణి` చిత్రంతో దర్శకుడిగా మారాడు. తొలి చిత్రాన్ని థియేటర్లలో చూసుకోవాలని ఎన్నో కలలు కన్న ఆ దర్శకుడు, చివరికి తన సినిమాని తానే చూసుకోలేకపోవడం అత్యంత బాధాకరం.