
బాలీవుడ్ 'ఫిట్‌నెస్ క్వీన్', 'స్టైల్ ఐకాన్'గా పేరు తెచ్చుకున్న మలైకా అరోరా, తన 52 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమె ఫిట్‌నెస్, అందం గురించి అందరూ మాట్లాడుకుంటారు. అయితే, గ్లామర్ ప్రపంచంలో ఆడవాళ్ల వయసు గురించి జరిగే చర్చలు, సమాజంలో ఉన్న రెండు నాల్కల ధోరణిపై మలైకా అరోరా (Malaika Arora) ఓపెన్‌గా ఫైర్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
'ది రైట్ యాంగిల్' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మలైకా, వయసు పైబడిన మగాళ్లను, ఆడవాళ్లను సమాజం చూసే తీరులో ఎంత తేడా ఉందో పూసగుచ్చినట్టు చెప్పారు. "నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఎప్పుడూ ఆడవాళ్ల వయసు, అందం, గ్లామర్ గురించే ప్రశ్నలు వేస్తారు. కానీ వయసు పైబడిన మగాళ్లకు ఇలాంటి ప్రశ్నలు అస్సలు ఎదురవ్వవు. ఆడవాళ్లు మాత్రమే తాము ఇంకా అందంగా ఉన్నామని పదే పదే నిరూపించుకోవాలా?" అని మలైకా సూటిగా ప్రశ్నించారు.
మలైకాకు ఎక్కువగా వినిపించే కామెంట్.. "ఈ వయసులో కూడా ఇంత ఫిట్‌గా ఉన్నారేంటి?". దీనికి మలైకా తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. "'ఆమె తన వయసుకు అద్భుతంగా కనిపిస్తుంది' (She looks amazing for her age) అనే మాటల్లో వయసును ఎందుకు హైలైట్ చేయాలి? నేను అప్పుడూ నేనే, ఇప్పుడూ నేనే, మరో 20 ఏళ్ల తర్వాత కూడా నేనే ఉంటాను. నా ఫిట్‌నెస్ అనేది నాలోని శక్తి, మానసిక బలం మీద ఆధారపడి ఉంటుంది కానీ, క్యాలెండర్‌లోని తేదీల మీద కాదు," అని ఆమె ఖరాఖండిగా చెప్పారు.
52 ఏళ్ల వయసులోనూ మలైకా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. "నేను ఉదయం లేవగానే అందంగా కనిపిస్తున్నానని అనుకోను. ఈ రోజు ఏదైనా కొత్తగా సాధించాలి, నా కుటుంబం, పిల్లలు గర్వపడేలా ఏదైనా చేయాలనే కసితో నిద్రలేస్తాను. ఇప్పుడు నేను నా జీవితంలోనే అత్యుత్తమ దశలో (Prime) ఉన్నాను," అని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.
చివరగా, మహిళలకు ఓ సలహా ఇస్తూ, "ఏ మహిళా తన వయసు గురించి క్షమాపణలు చెప్పాల్సిన, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రతి మహిళ తన వయసును ఒక గౌరవ పతకంలా (Badge of Honour) భావించాలి. తమ విజయాలను ఆస్వాదించాలి," అని మంచి మెసేజ్ ను మహిళలకు అందించారు. ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షోలలో జడ్జ్‌గా మెరుస్తున్న మలైకా, తన మాటలతో మరోసారి వార్తల్లో నిలిచారు.