
టాలీవుడ్ కి సంక్రాంతి మిస్సయింది. కానీ సమ్మర్ లో మాత్రం సినిమాల సందడి బలంగా ఉండబోతోంది. ఫిబ్రవరి నుంచి భారీ చిత్రాలన్నీ రిలీజ్ డేట్లు ఖరారు చేసుకుంటున్నాయి. భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న విడుదుల కానుంది. ఆ తేదీ కుదరకపోతే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే ఆర్ఆర్ఆర్ మార్చి 25న, ఆచార్య ఏప్రిల్ 29న, ఎఫ్3 ఏప్రిల్ 28న రానున్నాయి.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేష్ బాబు కూల్ గా రిలాక్స్ మోడ్ లో ఉన్న స్టిల్ తో సర్కారు వారి పాట రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని హాట్ సమ్మర్ లో మే 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
సర్కారు వారి పాట చిత్రం కూడా సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం మహేష్ బాబు త్యాగం చేశాడు. దీనితో స్వయంగా రాజమౌళి మహేష్ కు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మహేష్ బాబు సమ్మర్ లో రంగంలోకి దిగబోతున్నాడు. మహేష్ బాబు చాలా రోజుల తర్వాత నటిస్తున్న ఫుల్ కమర్షియల్ చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు ఈ మూవీలో మాస్ అండ్ స్టైలిష్ గెటప్ లో దర్శనం ఇస్తున్నాడు.
ఈ మూవీలో మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీ మేకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీత గోవిందం తర్వాత పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది.