
మొత్తానికి అందరూ ఊహించినట్లుగానే మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan)కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై ఆయన వేసిన పరువు నష్టం కేసును శుక్రవారం కోర్టు కొట్టివేసింది. కేవలం పబ్లిసిటీ పొందడం కోసమే మన్సూర్ ఇలాంటి పనులకు పాల్పడ్డాడంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ కేసు మన్సూర్‌పై త్రిష పెట్టాలని తెలిపింది.ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనకు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు అందజేయాలని ఆదేశించింది.
కేసు పూర్వపరాల్లోకి వెళితే...
"లియో మూవీలో నేను నటిస్తున్నట్లు తెలిసినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను. త్రిషను నా చేతులతో ఎత్తుకుని బెడ్ రూమ్‌లో వేసే సన్నివేశం ఉంటుందని ఊహించుకున్నా. కానీ, అతను (లోకేష్ కనగరాజ్) కనీసం త్రిషను చూపించను కూడా చూపించలేదు. ఇప్పటికే నేను చాలా రేప్ సీన్స్ చేశాను. కానీ, ఇది నాకు కొత్తగా ఉంటుంది అనుకున్నా" అంటూ మన్సూర్ అలీ ఖాన్. అసభ్యకర కామెంట్స్ చేసిన సంగతితెలిసిందే. ఈ ట్వీట్ పై త్రిష తీవ్రంగా స్పందించింది. అలాంటి నీచుడితో తన జీవితంలో ఇంకెప్పుడు నటించను అని త్రిష చెప్పేసింది.
ఇక "మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది. అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్ ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది" అని త్రిష ట్వీట్ చేసింది.
త్రిషకు మద్దతుగా చాలా మంది మాట్లాడారు. త్రిషకు మద్దతుగా 'లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి నిలిచారు. మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు.
ఈ విషయంపై రెస్పాండ్ అయ్యిన మన్సూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నారు. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఆ స్టేట్మెంట్ను సుమోటోగా స్వీకరించి మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
మహిళల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని తెలిపింది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పారు. అయితే తనపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన చిరుతో పాటు త్రిష, కుష్బూలపై పరువు నష్టం కేసు పెట్టారు. మొత్తం వీడియోను చూడకుండా తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపించిన ఆయన, వారి నుంచి ఆయన రూ.1 కోటి డిమాండ్ చేశారు.