
సంగీత ప్రియులకు నేడు చీకటి రోజు. లతా మంగేష్కర్ మరణం భారీ కుదుపు. తరాలుగా నిరంతరం వీనుల విందైన పాటలు అందించిన స్వర శిఖరం నేలకొరిగిన దుర్దినం. లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఆమె అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో. ప్రయాణాల్లో, పనుల్లో ప్రతి ఒక్కరి ఫేవరేట్ గా ఉన్న లతాజీ సాంగ్స్ ఉన్నాయి. ఒక గాయనిగా ఆమె లిఖించిన చరిత్ర తిరుగులేనిది. ఆమె కీర్తి అజరామరం. ఆమె అందుకున్న విజయాలు అనంతం. చేరుకున్న మజిలీలు దుర్బేధ్యం.
2022 జనవరి 11న లతా మంగేష్కర్ కరోనా (Corona virus)బారినపడ్డారు. ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లతాజీ వయసు రీత్యా వైద్యం అందించడానికి ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగారు. దాదాపు నెల రోజులుగా లతాజీ ఐసీయూలో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ట్ తీసుకుంటున్నారు.
లతాజీ ఆర్యోగం మెరుగుపడుతుందని, వెంటిలేటర్ సపోర్ట్ తీసేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అనూహ్యంగా లతాజీ ఆరోగ్యం మరలా క్షీణించడం మొదలుపెట్టింది. వైద్యులు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. 92 ఏళ్ల లతా మంగేష్కర్ (Latha Mangeshkar no more)తనువు చాలించారు.
తండ్రి మరణంతో 13 ఏళ్లకే సింగర్ గా మారిన లతా మంగేష్కర్... తన మొదటి సాంగ్ మరాఠి చిత్రం కోసం 1942లో పాడారు. అయితే ఈ సాంగ్ ఆ మూవీ ఆల్బంలో పొందుపరచలేదు. అలా మొదలైన ఆమె పాటల ప్రస్థానం దశాబ్దాల పాటు సాగింది. భాషాబేధం లేకుండా వేల కొలది పాటలు పలు చిత్ర పరిశ్రమలకు పాడారు. కెరీర్ లో లతా మంగేష్కర్ పాడినన్ని పాటలు మరో సింగర్ పాడలేదు. ఇది ప్రపంచ రికార్డు కూడాను. ఐదారు తరాల బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు లతా మంగేష్కర్ పాడారు.
లతాజీ మరణవార్త తెలిసిన చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లతాజీ మరణంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాటలను, ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిది అంటూ ఆవేదన చెందుతున్నారు.