
ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. సింగీతం సతీమణి లక్ష్మీ కల్యాణి శనివారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ఈ విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62 ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది అంటూ.. బాధతో నిండిన హృదయంతో.. సింగీతం సోషల్ మీడియా వేదికగా తన భార్య మరణాన్ని ప్రకటించారు. ఈ విషయం సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది.
1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల పెళ్లి జరిగింది. సింగీతం సీనీ జీవితంలో ఆయన భార్య లక్ష్మీ కల్యాణి కీలక పాత్ర పోషించారు. సినిమా స్క్రిప్ట్ రచనలో లక్ష్మీకల్యాణి ఆయనకు సహాయం చేసేశారు. ఈ కారణంగానే సింగీతం తన సతీమణి గురించి శ్రీకల్యాణీయం అనే ఓ పుస్తకాన్నికూడా రాశారు. ప్రస్తుతం సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
సింగీతం శ్రీనివాస్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. ఆదిత్య 369 లాంటి టైమ్ ట్రావెల్ సినిమాను తెరకెక్కించి.. అప్పట్లోనే ఫ్యూచర్ టెక్నాలజీని భవిష్యత్ తరాలకు కళ్లకు కట్టినట్టుచూపించారు సింగీతం. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలకు నాందిపలికిన సింగీతం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ మధ్యే ప్రభాస్ నటించబోతున్న ప్రాజెక్ట్ కే సినిమాకు తొలుత కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నా.. ఆయన ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు. చెన్నైలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటూ.. అప్పుడప్పుడూ.. సినిమా కార్యక్రమాలకు వెళ్తూ.. భార్యతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఇక సింగీతం భార్య మృతికి సినీ పరిశ్రమలోని పలువురు సంతాపం తెలిపారు.