Lata Mangeshkar:మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం.. కోలుకోవాలని మీరు ప్రార్ధనలు చేయండి-వైద్యులు

By Sambi ReddyFirst Published Jan 20, 2022, 9:31 AM IST
Highlights

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు లేటెస్ట్ అప్డేట్ (Health Update)ఇచ్చారు.

దాదాపు రెండు వారాలుగా సింగర్ లతా మంగేష్కర్(Lata Mangeshkar) కోవిడ్ తో పోరాడుతున్నారు. ఐసీయూలో ఆమెకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు లేటెస్ట్ అప్డేట్ (Health Update)ఇచ్చారు.  లతా మంగేష్కర్ గారిని పర్యవేక్షిస్తున్న డాక్టర్ ప్రతిత్ సమదానీ  మాట్లాడుతూ “లతా జీ ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నారు, ఆమె త్వరగా కోలుకునేలా మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించండి”, అని తెలియజేశారు. 

జనవరి 8న సింగర్ లతా మంగేష్కర్‌కు కోవిడ్-19 (Covid 19)పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నిర్థారణ కావడంతో లతా గారిని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చారు. లతా మంగేష్కర్ వయసు రీత్యా ఎక్స్పర్ట్స్ వైద్య బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.  మరోవైపు లతా మంగేష్కర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

13ఏళ్లకే సింగర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన లతా మంగేష్కర్ దశాబ్దాల పాటు సినిమా పాటను ఏలారు. భాషా భేదాలు లేకుండా కెరీర్ లో 25000  పైగా పాటలు పాడారు. సింగర్ గా లతా అందుకున్న అవార్డులు, సాధించిన విజయాలు మరెవరికీ సాధ్యం కావు. 2001లో దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' అవార్డు ఆమెను వరించింది. అలాగే 2007లో ఫ్రాన్స్ దేశం తమ అత్యున్నత గౌరవ పురస్కారం 'లీజన్ ఆఫ్ హానర్' తో లతాను గౌరవించింది. పద్మభూషణ్, దాదా సాహెబ్ పాల్కే వంటి ఉన్నతమైన అవార్డ్స్ లతా మంగేష్కర్ సేవలకు భారత ప్రభుత్వం అందించింది.

కాగా రోజుల వ్యవధిలో అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఒక్క టాలీవుడ్ లోనే మహేష్ బాబు (Mahesh Babu), రాజేంద్ర ప్రసాద్, త్రిష, బండ్ల గణేష్, థమన్ లతో పాటు పలువురికి కరోనా సోకింది. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. రెండేళ్లుగా కరోనా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షికంగా కరోనా ఆంక్షలు విధించాయి. అలాగే మాస్క్ ధరించడం తో పాటు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కారణం... వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతుంది. 

click me!