
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. దాదాపు 3 నెలలుగా అన్ని రంగాలు పూర్తిగా కుదేలయ్యాయి. ముక్యంగా వినోద రంగం మీద కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావం సాధారణ కార్మికులతో పాటు కొంత మంది ఉన్నత స్థాయిలో ఉన్నవారి మీద కూడా తీవ్రస్థాయిలో ఉంది.
ఇప్పటికే లాక్ డౌన్ కష్టాల కారణంగా సినీ నటులు, సాంకేతిక నిపుణులు ఆత్మ హత్య చేసుకున్న వార్తలు కూడా వినిపిస్తుండగా తాజాగా మరో మరణం కూడా నమోదైంది. తమిళ యువ దర్శకుడు బాల మిత్రన్ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఆయన వయసు 39 సంవత్సరాలు మాత్రమే. ప్రముఖ దర్శకుడు సుకి మూర్తి వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసిన కళ్వర్‌గళ్, ఉడుక్కై చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే లాక్ డౌన్ ప్రకటించటంతో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు బాలమిత్రన్. అదే సమయంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. ఉన్నట్టుండి పక్షవాతం కూడా రావటంతో సమస్యలు ఎక్కువయ్యాయి. అయితే స్నేహితుల సాయంతో ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.