
ఇండస్ట్రీలో వరస రీమేక్ లు బోల్తా కొడుతూండటంతో తమ హీరో రీమేక్ చేస్తున్నాడనే వార్త వస్తేనే కంగారు పడిపోతున్నారు ఫ్యాన్స్. దాంతో చిరంజీవి కు చెందిన మెగా క్యాంప్ సైతం కొంతకాలం పాటు రీమేక్ లు ప్రక్కన పెట్టేయాలనుకుంటోందని సమాచారం. బాలయ్య వంటి హీరోలు అయితే రీమేక్ లు కు మొదటే నో చెప్పేస్తారు. వరస రీమేక్ లు చేసే వెంకీ సైతం కొద్ది కాలంగా రీమేక్ సబ్జెక్టులకు దూరంగా ఉంటున్నారు. అయితే నాగార్జున మాత్రం రీమేక్ తోనే హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం.
కింగ్ నాగార్జున కొత్త సినిమా ప్రకటన ఈ రోజు రాబోతోంది. ఆగస్టు 29 పుట్టినరోజును పురస్కరించుకొని, చాన్నాళ్లుగా వార్తలకే పరిమితమైన 'Nag 99' ప్రాజెక్ట్ ని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. అంతేకాదు ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ ను కూడా వదిలారు. 'కింగ్ వస్తున్నాడు' అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో హీరో సైకిల్ మరియు దాని మీద ఒక పెద్ద కత్తి, బ్యాగ్రౌండ్ లో విలేజ్ సెటప్ చూస్తుంటే.. నాగ్ ఈసారి ఊర మాస్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడని అర్దమవుతోంది. లాంగ్ హెయిర్, రఫ్ గడ్డంతో ఈ సినిమాలో నాగ్ ..వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారనే స్పష్టం అవుతుంది.
అయితే ఈ సినిమా 'పొరింజు మరియం జోస్' అనే మలయాళ చిత్రం రీమేక్ అంటున్నారు. మొదట బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలోనే ఈ మూవీ ఉంటుందని టాక్ నడిచింది. రకరకాల చర్చలు, వివాదాలు నడిచి చివరకు ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ని డైరెక్టర్ గా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. బిన్నీ వేరే కథతో అన్నపూర్ణ స్టూడియోని ఎప్రోచ్ అయితే ఈ సినిమా చేయమని నాగ్ చెప్పినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే లేటెస్టుగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మిగతా డిటేల్స్ ఏమీ మేకర్స్ వెల్లడించలేదు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇక నిజంగా ఈ సినిమా రీమేక్ అయినా భయపడాల్సిన పనిలేదు. నాగ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే స్క్రిప్టు ఓకే చేసి ఉంటారు. ఈ రీమేక్ హిట్ అయితే మళ్లీ చాలా రీమేక్ లు మన ముందుకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ చిత్రానికి 'గలాటా' 'భలే రంగడు' అనే టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత, ఫైనల్ గా 'నా సామి రంగా' అనే టైటిల్ కే నాగ్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తారని వార్తలు ఉన్నాయి. అంతేకాదు 2024 సంక్రాంతికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.