
కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2)విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో కూడా ఈ చిత్ర వసూళ్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరో వారం కెజిఎఫ్2 ప్రభంజనం థియేటర్స్ కొనసాగే అవకాశం కలదు . ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న విడుదల కావాల్సిన మూడు తెలుగు చిత్రాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. ఈ శుక్రవారం విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అశోక వనంలో అర్జున కళ్యాణం విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్ర విడుదల మే 6కి వాయిదా వేశారు.
అలాగే స్టార్ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు మొదట ప్రకటించారు. అనంతరం ఈ చిత్ర విడుదల మే 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి సైతం ఏప్రిల్ 22న విడుదల చేయాలని భావించారు. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో మే 6కి వాయిదా వేశారు.
కెజిఎఫ్ 2 మేనియాతో సినీ ప్రేమికులు ఊగిపోతుండగా మిగతా చిన్న చిత్రాలను ప్రేక్షకులు పట్టించుకునే అవకాశం లేదు. పెద్ద చిత్రానికి ఎదురెళ్లి బోల్తా పడటం కంటే వేచి చూడడమే బెటర్ అని మేకర్స్ నిర్ణయానికి వచ్చారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీ సైతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తుంది. ఈ చిత్ర వసూళ్లకు ఇంకా గండి పడలేదు. కొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి.
అలాగే ఏప్రిల్ 29న మరో పెద్ద చిత్రం ఆచార్య విడుదల ఉంది. ఇన్ని ప్రతికూలతల మధ్య ఏప్రిల్ 22న విడుదల చేయడం చిన్న చిత్రాలకు ఆత్మహత్యాసదృశ్యమే. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన వారానికి థియేటర్స్ లో దిగిన గని ఘోరమైన పరాజయం మూటగట్టుకుంది. ఆ సినిమా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ అంశాలు పరిగణలోకి తీసుకున్న ఈ మూడు చిత్రాల నిర్మాతలు మే 6కి వాయిదా వేసుకున్నారు.