అమ్మకు గుడ్ బై చెప్పిన కారులో లైంగిక దాడికి గురైన నటి

First Published Jun 27, 2018, 10:06 PM IST
Highlights

కారులో 2017లో లైంగిక దాడికి గురైనట్లు భావిస్తున్న మలయాళీ నటి మలయాళం మూడీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)కు గుడ్ బై చెప్పారు. 

కొచ్చి: కారులో 2017లో లైంగిక దాడికి గురైనట్లు భావిస్తున్న మలయాళీ నటి మలయాళం మూడీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)కు గుడ్ బై చెప్పారు. సంక్షోభ సమయంలో తన పక్కన నిలబడడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆమె అమ్మ నుంచి తప్పుకున్నారు. 

ఆమెకు సంఘీభావం ప్రకటిస్తూ ప్రముఖ తారలు రేమ్యా నంబీసన్, రీమా కల్లింగల్, గీతు మోహన్ దాస్ కూడా అమ్మ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న హీరో దిలీప్ ను తిరిగి తీసుకోవాలని అమ్మ సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. 

నిందితుడిని తిరిగి తీసుకోవాలనే అమ్మ నిర్ణయం వల్ల తాను ఆ నిర్ణయం తీసుకోలేదని, అమ్మతో ఎదురైన చేదు అనుభవం వల్ల  తాను ఆ నిర్యయం తీసుకున్నానని తన ఫేస్ బుక్ పేజీలో ప్రకటించారు. 

తనకు అవకాశాలు రాకుండా దిలీప్ అంతకు ముందు చాలా చేశారని, తాను ఫిర్యాదు చేసినప్పటికీ అమ్మ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆమె అన్నారు. లైంగిక దాడి తర్వాత కూడా  అతన్ని రక్షించడానికి అమ్మ ప్రయత్నించిందని ఆరోపించారు. సంస్థలో ఉండడం వల్ల అర్థం లేదని చెప్పి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. 

సభ్యురాలైన బాధితురాలికి మద్దతుగా అమ్మ నిలబడలేదని, పైగా దిలీప్ ను బలపరిచిందని, ఆ నటుడిని తిరిగి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విని దిగ్భ్రాంతికి గురయ్యామని, అది కూడా అప్రజాస్వామిక పద్ధతిలో చేశారని ఇతర తారలు అన్నారు. 

తాము అమ్మ నిర్ణయాన్ని సమర్థించలేమని, న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలికి బలమైన మద్దతు అందజేస్తామని వారన్నారు. అమ్మ హెడ్ మోహన్ లాల్ ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. 

నటిని నిర్బంధించి, దాడికి పాల్పడిన కేసులో పోలీసులు పల్సర్ సునీతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించిన ఆ తారను కారులో నిర్బంధించి, రెండు గంటల పాటు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన 2017 ఫిబ్రవరి 17వ తేదీన జరిగింది.

click me!