
`ఆర్‌ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చాడు కార్తికేయ. ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఊహంచని సక్సెస్, ఊహించని ఇమేజ్ నేపథ్యంలో కార్తికేయ ఉక్కిరి బిక్కిరయ్యాడు. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ ల ఎంపికలో బోల్తా పడ్డాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు కమర్షియల్ హిట్ పడలేదు. ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు `బెదురులంక 2012` చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు `ఆర్‌ఎక్స్ 100` సెంటిమెంట్‌ని కూడా ఫాలో అవుతున్నాడు కార్తికేయ.
`ఆర్‌ఎక్స్ 100`లో ఆయన పేరు శివ, సినిమా గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్‌లో సినిమా సాగుతుంది. ఇప్పుడు `బెదురులంక 2012`లో కూడా ఆయన పేరు శివ(శంకర వరప్రసాద్). ఈ సినిమా కూడా గోదావరి బ్యాక్ డ్రాప్‌లోనే సాగుతుంది. ఆ సమీపంలోని బెదురులంక గ్రామంలో ఈ కథ సాగుతుందట. 2012లో యుగాంతం వస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో అంతా భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ వార్త నేపథ్యంలో బెదురులంక అనే గ్రామంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, అక్కడి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ఏం చేశారు? అనే అంశాల సమాహారంగా ఈ సినిమా సాగుతుందట. కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో సాగుతుందని తెలిపారు హీరో కార్తికేయ.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, `ఆర్100`కి, `బెదురులంక2012`కి పోలికలపై స్పందిస్తూ అది యాదృశ్చికంగానే జరిగిందని, కావాలని పెట్టలేదన్నారు. అయితే ఆ సెంటిమెంట్, లక్ ఈ సినిమాకి వర్కౌట్ అయితే బాగుంటుందని కోరుకున్నారు. సినిమాతో తన పాత్ర పేరు చిరంజీవి ఒరిజినల్ పేరుని పెట్టడంపై చెబుతూ, మొదట శివ అనుకున్నారని, జస్ట్ శివ అంటూ కంప్లీట్ ఫీలింగ్ లేదనే ఉద్దేశ్యంతో వర ప్రసాద్ ని యాడ్ చేశారట. ఎలాగూ తాను చిరంజీవికి అభిమాని కావడంతో, లెజెండ్ పేరు కావడంతో అది పాజిటివ్ వైబ్ ఇస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.
నెగటివ్ రోల్స్ చేయడంపై స్పందిస్తూ, 'వలిమై' తర్వాత తమిళ ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అందుకని, ప్రతి సినిమాను తమిళ భాషలో విడుదల చేయాలని అనుకోవడం లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే కథ అనుకున్నప్పుడు బైలింగ్వల్ చేస్తా. 'వలిమై' తర్వాత తమిళం నుంచి రెండు మూడు అవకాశాలు వచ్చాయి కానీ నాకు ఎగ్జైటింగ్ అనిపించలేదు. అలాగే ఆ తర్వాత కూడా నెగటివ్‌రోల్స్ వచ్చాయి, కానీ ఇంపాక్ట్ చూపించే పాత్రలు రాలేదు. అందుకే ఒప్పుకోలేదు.
చిరంజీవిపై ఇటీవల చేసిన కామెంట్లపై స్పందిస్తూ, ఆయనకు నేను అభిమానిని. అంత కంటే ఎక్కువగా నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి. సినిమాల పట్ల నాలో బాధ్యత పెంచిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయనలా డ్యాన్సులు చేయాలని, హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చా. మా ఇంట్లో అమ్మ కూడా 'వీడు ఒక్క పని సరిగా చేయడు. సినిమా అంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు' అంటుంది. రెస్పాన్సిబిలిటీ రావడానికి కారణం ఆయన. కానీ ఇటీవల ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఆయనపై కామెంట్లు చేస్తే మనపై మనం కామెంట్లు చేసుకున్నట్టే అవుతుందన్నారు కార్తికేయ.
ఫెయిల్యూర్స్ పై రియాక్ట్ అవుతూ, ఒక్కో సినిమా నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటాం. ప్రతి సినిమా హిట్ అవ్వాలని చేస్తాం. మనం ఓ రిజల్ట్ ఆశిస్తాం. అది రానప్పుడు తప్పు ఎక్కడ జరిగింది? అని ఆలోచిస్తాం. ఉదాహరణకు... ఓ సీన్ బావుందని, పాయింట్ కొత్తగా ఉందని సినిమా చేయకూడదని అర్థం చేసుకున్నా. కథ, ప్రతి సీన్ ఎగ్జైట్ అయినప్పుడు మాత్రమే చేయాలన్నారు. దీంతోపాటు ఇప్పుడున్న అవగాహన,మెచ్యూరిటీ `ఆర్‌ఎక్స్ 100` టైమ్‌లో ఉంటే మంచి స్క్రిప్ట్ లు ఎంపిక చేసేకునేవాడిని అని తెలిపారు.
నెక్ట్స్ సినిమాల గురించి చెబుతూ, యూవీ క్రియేషన్‌లో ఓ సినిమా చేస్తున్నా. యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీ జానర్ ఫిల్మ్ అది. ప్రశాంత్ అని కొత్త దర్శకుడితో చేస్తున్నాను. మరో రెండు మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. `ఆర్‌ఎక్స్ 100` డైరెక్టర్ అజయ్ భూపతి తాను కలుస్తున్నామని, సినిమా చేయాలనుకుంటున్నాం. సరైన కథ దొరకాలి. అన్నీ కుదిరితే సినిమా చేస్తామని తెలిపారు.