
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరుపదుల వయస్సులోను ఎంతో ఎనర్జిటిక్‌తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ రజనీకాంత్ అంటేనే స్టైల్ లో చెప్పే డైలాగ్స్ కు, నడకకు, నవ్వుకు ఫేమస్. అయితే తెరపై నవ్వే నవ్వు వేరు. దానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు రజనీ ఉంటారు అనేది ఆసక్తికరమే. సాధారణంగా తెర వెనక విషయాలు, వీడియోలు పెద్దగా బయిటకు రావు. కానీ రజనీకాంత్ ఫ్యాన్స్ కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు...రజనీ డబ్బింగ్ చెప్తూ నవ్వే వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పేట చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. తమిళంలో ఓకే అనిపించుకున్నా తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఈ చిత్రం విడుదలై ఇరవై ఐదు రోజులు కావడంతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తన ట్విట్టర్‌లో రజనీకాంత్ పేట చిత్రానికి డైలాగ్ చెబుతున్న డబ్బింగ్ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో అభిమానలుకి తెగ నచ్చేస్తోంది.
ఈ చిత్రంలో రజనీకాంత్ కళాశాల వార్డెన్‌గా అదరకొట్టారు. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందించిన ఈ చిత్రంలో... సిమ్రాన్, విజయ్ సేతుపతి, బాబీ సింహా, మేఘా ఆకాశ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. రజనీకాంత్ సరసన సిమ్రాన్, త్రిష నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో ఏ ఆర్ మురుగదాస్‌తో కలిసి రాజకీయ నేపథ్యంలో చిత్రం చేయనున్నాడు రజనీకాంత్.