కర్ణాటకలో ముదురుతున్న సన్నీ వ్యతిరేక ఆందోళన

First Published Dec 16, 2017, 3:27 PM IST
Highlights
  • సన్నీ లియోనీకి వ్యతిరేకంగా బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళన
  • నూతన సంవత్సర వేడుకల్లో ఈ సారి బెంగళూరుకు సన్నీ
  • సన్నీ వస్తే ఆత్మహత్య చేసుకుంటామంటున్న కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు

సన్నీలియోనికి వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో నిర్వహించనున్న నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొనటానికి నిరసనగా కర్ణాటక రక్షణ వేదిక యువసేన నగరంలోని మాన్యతా టెక్‌ పార్కు ఎదుట ఆందోళన చేపట్టారు. సన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ సంస్కృతిని అవమానించడమే నని ఆరోపిస్తున్న కార్యకర్తలు ఆమె ఫొటోలు తగులబెట్టారు. న్యూ ఇయర్ వేడుకలు నిలిపేయకుంటే డిసెంబరు 31న ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడతామని యువసేన సంఘం కార్యకర్తలు హెచ్చరించారు.

 

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరీష్‌ మాట్లాడుతూ.. ‘సన్నీ పొట్టి దుస్తులు ధరించడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఆమె చీర కట్టుకుని కార్యక్రమానికి వస్తే.. వెళ్లండి, చూడండి. సన్నీకి గతం బాగోలేదు. ఇలాంటి వారిని మేం ప్రోత్సహించం. డిసెంబరు 31న ఆత్మహత్యకు పాల్పడటానికి మేం ఏ మాత్రం సంకోచించడం లేదు’ అని అన్నారు.

 

అయితే నిర్వాహకులు మాత్రం మరో వెర్షన్ వినిపిస్తున్నారు. ఇది ఓ కుటుంబ వేడుక లాంటిదని.. సన్నీ కన్నడ పాటకు డ్యాన్స్‌ చేయబోతున్నారని చెప్పారు. ‘బెంగళూరుకు చెందిన నేను.. ఇక్కడి సంస్కృతికి తగినట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నా. సన్నీకి దీని కంటే పెద్ద ఆఫర్లు వచ్చాయి, కానీ, ఆమె వాటిని కాదని బెంగళూరుకు రావడానికి ఒప్పుకొన్నారు. ఎందుకంటే.. బెంగళూరు, హైదరాబాద్‌ ఆమెకు చాలా ఇష్టమైన ప్రదేశాలు. ఆందోళనకారులు ఏం కోరుకుంటున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. దీని వల్ల రాష్ట్ర సంస్కృతికి ఎటువంటి అవమానం జరగదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

 

పైగా సన్నీ పలు కన్నడ సినిమాల్లో నటించారు. ‘డీకే’ అనే చిత్రంలో అతిథి పాత్రను పోషించారు. అప్పుడు లేని ఆందోళనలు ఇప్పుడు కొత్తగా ఎందుకో అర్థం కావటంలేదని పేర్కొన్నారు. కాగా సన్నీకి వ్యతిరేకంగా యువసేన ఆందోళన గత కొద్ది రోజులుగా సాగుతోంది.

click me!