
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు కూడా తమ తమ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమకు సన్నిహితంగా ఉండే సినీ సెలబ్రిటీల చేత ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్న కే సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం చేశారు.
ఈ ఎన్నికల్లో కే సుధాకర్ చిక్కబళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన గెలుపు కోసం చిక్కబళ్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బ్రహ్మానందం నేడు ప్రచారం నిర్వహించారు. ఓ ప్రాంతంలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. సుధాకర్‌ను గెలిపించాలని కోరారు. తాను హైదరాబాద్ నుంచి వచ్చానని.. సుధాకర్‌ను తప్పకుండా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఎంతమంచివాడో మనందరికీ తెలుసునని అన్నారు. ‘‘ఏయ్ గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయి..’’ అంటూ సరదాగా డైలాగ్ చెప్పి జనాలు ఉత్సహపరిచారు.
బ్రహ్మానందం రాకతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇదిలా ఉంటే.. 2019లో చిక్కబళ్లాపూర్ ఉప ఎన్నిక సమయంలో కూడా బ్రహ్మానందం.. సుధాకర్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
కే సుధాకర్ విషయాని వస్తే.. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే 2019లో గ్రెస్-జేడీఎస్‌లకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో పాటు సుధాకర్ కూడా బీజేపీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే అనర్హత వేటు ఎదుర్కొని.. ఉప ఎన్నిలకు వెళ్లారు. అప్పుడు బీజేపీ అభ్యర్థిగా చిక్కబళ్లాపూర్ నుంచి సుధాకర్ విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక, కొన్ని నెలల కిందట తెలుగు నటుడు తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న కే సుధాకర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. తారకరత్నను పరామర్శించేందుకు సినీ నటులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు బెంగళూరులోని ఆస్పత్రికి వెళ్లిన సమయంలో వారికి సుధాకర్ స్వాగతం పలకడంతో పాటు, వారితోనే ఆస్పత్రికి కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. తద్వారా సుధాకర్ తెలుగు ప్రజలకు సుపరిచుతులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజులకు తారకరత్న తుదిశ్వాస విడవటం నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, అభిమానుల్లో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే.