ఏ తప్పు చేయలేదు.. చట్ట ప్రకారమే ఆ చిన్నారి దత్తత : చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సోదాలపై కరాటే కళ్యాణి తల్లి

By Siva KodatiFirst Published May 15, 2022, 6:21 PM IST
Highlights

సినీనటి కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించడంపై ఆమె తల్లి విజయలక్ష్మీ స్పందించారు. తమ ఇంట్లో వున్న చిన్నారిని చట్ట ప్రకారమే దత్తత తీసుకున్నామని.. ఏ తప్పూ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. 
 

సినీనటి కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు (child welfare officers) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆమె ఇంట్లో వుంటున్న చిన్నారి ఎవరన్న దానిపై ఆరా తీశారు. ఈ వ్యవహారంపై కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మీ స్పందించారు. తాము ఏ తప్పు చేయలేదని.. చట్ట ప్రకారమే అమ్మాయిని దత్తత తీసుకున్నామని ఆమె తెలిపారు. 12 ఏళ్ల అబ్బాయిని కళ్యాణి పెంచుతోందని.. ఇప్పుడు మరొక అమ్మాయిని పెంచుకుంటోందని విజయలక్ష్మీ స్పష్టం చేశారు. డిసెంబర్ 25న పుట్టిన పాపను 28న ఇంటికి తీసుకొచ్చిందని.. అమ్మాయి పేరు మౌక్తిక అని ఆమె తెలిపారు. అబ్బాయిని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చామని విజయలక్షీ చెప్పారు. 

అంతకుముందు తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే..ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి వంత పాడుతావా అంటూ సినీనటి కరాటే కళ్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై ఆగ్రహాంతో ఊగిపోయింది. విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులతో గొడవపడడం మంచిది కాదని స్టేషన్‌ నుంచి కళ్యాణిని (Karate Kalyani) బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీఐపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు.

ఈ విషయమై వివరణ కోరగా సీఐ సైదులు చట్ట ప్రకారం సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబ్‌ ఫ్రాంక్‌ స్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదులను తీసుకుని ఇరువురిపై కేసులు నమోదు చేశాం. కళ్యాణి మాత్రం తనను అన్యాయంగా కేసులో ఇరికించావని గొడవ పెట్టుకొంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. దాడికి కారుకులు ఎవరనేది తేలగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సీఐ సైదులు వెల్లడించారు.

ఇక, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి చేసింది. ప్రాంక్ వీడియోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి.. శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే అక్కడ గొడవ జరిగింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డిపై కల్యాణి దాడి  చేసింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

మరోవైపు శ్రీకాంత్ తనపై కూడా దాడి చేసినట్టుగా కల్యాణి తెలిపింది. ఫ్రాంక్‌ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.

click me!