
చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తారకరత్న మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ రోధిస్తుంటే.. కన్నడలో తాజాగా విషాదకర ఘటన చోటు చేసుకుంది. కన్నడ దిగ్గజ దర్శకుడు ఎస్ కె భగవాన్ (98) నేడు తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన కొంతకాలంగా వయసురీత్యా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
కాగా నేడు ఎస్ కె భగవాన్ పరిస్థితి విషమించడంతో బెంగుళూరులో కన్నుమూశారు. కన్నడ దిగ్గజ నటుడు కంఠీరవ రాజ్ కుమార్ తో భగవాన్ ఎక్కువ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ అందించారు. దొరై రాజ్, యస్ కె భగవాన్ కలసి తెరకెక్కించిన చిత్రాలు ఇప్పటికి ప్రేక్షకులని అలరిస్తూ ఉంటాయి.
వీళిద్దరూ బెస్ట్ డైరెక్టర్ జోడిగా గుర్తింపు పొందారు. భగవాన్ తన స్నేహితుడు దొరై రాజ్ తో కలసి దాదాపు 55 చిత్రాలని తెరకెక్కించారు. భగవాన్ మరణ వార్త తెలియగానే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. యస్ కె భగవాన్ గారి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. భగవాన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
భగవాన్ 1933లో జూలై 5న జన్మించారు. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తితో భగవాన్ చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలు పెట్టిన భగవాన్ ఆ తర్వాత తిరుగులేని దర్శకుడిగా మారారు. కస్తూరి నివాస్, ఎరడు సోయం, బయలు దారి లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని భగవాన్ తెరకెక్కించారు.