
లోకనాయకుడు కమల్ హాసన్ కాస్త తగ్గాడు. కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌కి లెటర్ రాశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. అయితే తన లెటర్‌లో ఆయన ఎక్కడ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కమల్ తన లెటర్‌లో ఏంచెప్పాడనేది చూస్తే.
`కన్నడ భాష అన్నా, ప్రజలన్నా నాకు నిజమైన ప్రేమ ఉంది. `థగ్ లైఫ్` ఆడియో లాంచ్‌లో కన్నడ భాష గురించి నేను అన్న మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి, పరస్పర గౌరవంతో ఉందాం` అని కమల్ హాసన్ KFCCకి రాసిన లెటర్‌లో పేర్కొన్నారు. కన్నడ తమిళం నుంచి పుట్టిందన్న తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకుండా, సమర్థించుకున్నట్టు అనిపిస్తోంది.
`థగ్ లైఫ్` ఆడియో వేడుకలో కన్నడ తమిళం నుంచి పుట్టిందన్న వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, కమల్ హాసన్ KFCCకి లెటర్ రాశారు. హైకోర్ట్ కూడా క్షమాపణలు చెప్పాలని ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు కమల్ దిగి వచ్చారు. KFCC అధ్యక్షుడు నరసింహలుకు రాసిన ఈ లెటర్‌లో, తన వ్యాఖ్యలను వివరిస్తూ, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
డా. రాజ్‌కుమార్ కుటుంబం, ముఖ్యంగా శివరాజ్‌కుమార్‌తో ఉన్న అనుబంధంతోనే ఆ మాట అన్నానని, అందరం ఒకే కుటుంబం అని చెప్పాలనుకున్నానని, కన్నడ భాషను కించపరచాలనే ఉద్దేశం లేదని కమల్ లెటర్‌లో రాశారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు.
కన్నడ భాష గొప్పదనం, సాహిత్య సంపద గురించి నాకు తెలుసు. కన్నడిగుల నుంచి నాకు ఎంతో ప్రేమ, అభిమానం దక్కాయి. కన్నడ భాష, ప్రజలంటే నాకు నిజమైన ప్రేమ ఉందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని కమల్ లెటర్‌లో రాశారు.
అన్ని భారతీయ భాషలూ సమానమే అని నేను నమ్ముతాను. ఏ భాషా ప్రాబల్యాన్నీ నేను సమర్థించను. అది భారతీయ భాషల ఐక్యతకు భంగం కలిగిస్తుంది. నేను సినిమా భాష మాట్లాడతాను. అది ప్రేమ, అనుబంధాల భాష. నా మాటల ఉద్దేశం కూడా అదే. శివన్నా `థగ్ లైఫ్` ఈవెంట్‌కి ప్రేమతో వచ్చారు. కానీ, నా వ్యాఖ్యల వల్ల ఆయనను కూడా వ్యతిరేకించడం బాధ కలిగించింది. కానీ, మా మధ్య ఉన్న ప్రేమ, గౌరవం చాలా బలమైనవి.
నా మాటలు ఎలా అర్థమైనా, కన్నడ భాషపై నాకున్న గౌరవాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కర్ణాటక ప్రజలపై నాకున్న ప్రేమ, గౌరవాన్ని గుర్తించాలని మనవి చేస్తున్నాను. ఇది తాత్కాలిక అపార్థం. ఈ సమయంలో పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం` అని కమల్ హాసన్ లెటర్‌లో రాశారు.
మరి ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందా? సారీ చెప్పనందుకు మరింత రచ్చ చేస్తారా? అనేది చూడాలి. కమల్ నటించిన `థగ్ లైఫ్` రేపు గురువారం(.జూన్ 5)న విడుదల కాబోతుంది. కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో ఈ మూవీని బ్యాన్ చేస్తామని కన్నడ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.