
"భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి మన దేశం చూసిన అసలైన పాన్ ఇండియా సూపర్ స్టార్" అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఆమె బయోపిక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొన్నారు.
ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో నటిస్తున్న రష్మిక మందన్న గురించి కమల్ మాట్లాడుతూ.. "పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ పాత్ర చేయాలంటే ఒక నటుడికి ఎంత ప్రెజర్ ఉంటుందో, ఇప్పుడు రష్మికకు కూడా అలాంటి సవాలే ఎదురైంది. ఎంఎస్ అమ్మ కళ్లలో కనిపించే ఆ కరుణను తెరపై చూపిస్తే చాలు, సగం సక్సెస్ అయినట్లే. దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఇలాంటి ఐకానిక్ పాత్రకు రష్మిక కచ్చితంగా న్యాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది" అని చెప్పారు.
ఈ అవకాశం రావడంపై హీరోయిన్ రష్మిక మందన్న ఎమోషనల్ అయ్యారు. "అమ్మగారి గొంతులో ఒక దైవ శక్తి ఉంది. ఆమె పాట వింటుంటే సాక్షాత్తూ దేవుడి సన్నిధిలో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. నా కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కోసం ఇస్తాను" అని రష్మిక ప్రామిస్ చేశారు.
'జెర్సీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు.