
లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో కాంప్లెక్స్ సుప్రీం యాస్కిన్ పాత్రలో అదరగొట్టాడు. కనిపించింది కాసేపే అయిన `భూకంపం సృష్టిస్తా` అనేంతగా ఇంపాక్ట్ చూపించాడు. ఆ సినిమా వచ్చిన రెండు వారాల్లోనే ఇప్పుడు `భారతీయుడు 2`తో రాబోతున్నాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్ మాట్లాడుతూ `ఇండియన్` సినిమా జర్నీని తెలిపారు. ఏఎం రత్నం ఇన్వెస్ట్ చేయడం వల్ల `భారతీయుడు` సినిమా స్టార్ట్ అయ్యిందని, ఆయన పెద్ద డబ్బున్న వ్యక్తి కాదు. కానీ ఎంతో ప్యాషన్‌తో ఆయన ఆ మూవీని స్టార్ట్ చేశారని తెలిపారు కమల్ హాసన్.
ఇందులో తాను `ఇండియన్ 2`పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను `ఇండియన్ 3` కోసం ఆతృతగా ఉన్నానని, దానికోసమే ఈ సినిమా చేశానని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద రచ్చ అయ్యాయి. అంటే `ఇండియన్ 2` కమల్‌కి నచ్చలేదా? అందులో మ్యాటర్ లేదా? అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇది కమల్ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ఈవెంట్‌లో దీనిపై కమల్ క్లారిటీ ఇచ్చాడు. ఎక్కడికెళ్లినా `ఇండియన్ 3` గురించి మాట్లాడితే `ఇండియన్ 2` బాగా లేదని అనుకుంటారని శంకర్ గారు వార్నింగ్ ఇచ్చారు. నా విషయంలో `ఇండియన్ 2`నే, `ఇండియన్ 3`, నాకు రెండూ ఒక్కటే అని చెప్పారు. కానీ నేను రెండో పార్ట్ చూసినప్పుడు మీ నుంచి వచ్చే రియాక్షన్ చూడాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా అని, `భారతీయుడు 2` పెద్ద హిట్ కావాలని, ఆతర్వాత `ఇండియన్ 3`ని చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు కమల్. ఆ సినిమాలో నేను యాక్టర్, అదే సమయంలో సినిమాకి నేను అభిమానిని కూడా అన్నారు.
ఇంకా కమల్ మాట్లాడుతూ, `52 ఏళ్ల క్రితం టెక్నీషియన్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మూడు తరాలు నన్ను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. `భారతీయుడు` రిలీజ్ అయినప్పుడు ఈ సీక్వెల్ గురించి ఆలోచించలేదు. `భారతీయుడు` భారీ హిట్ అయింది. డబ్బులు వస్తాయా? అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్‌కి పెట్టే ఖర్చే ఆ సినిమా బడ్జెట్‌కి డబుల్ ఉంటుంది. శంకర్ గారి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్ప స్థానం ఉంది. నా జీవితంలో తెలుగుకి గొప్ప స్థానం ఉంది. మరో చరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం వంటివి నా జీవితంలో వచ్చాయి. బాలచందర్, విశ్వనాథ్ వంటి వారు భాషాబేధాలను తుడిచిపారేశారు.
`ఇండియన్ 2` ఇప్పటి తరానికి రిలవెంట్‌గా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తరువాత మళ్లీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావడం అదృష్టం. ఇన్నేళ్లు నన్ను స్టార్‌గా నిలబెట్టారు. ఈ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను. ఈ మూవీ సెట్‌లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదని అన్నారు. నాలో సేనాపతి వచ్చాడు. ఇండియన్ 2 జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి` అని అన్నారు. అలాగే నన్ను, రజనీని బాలచందర్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఇంతటి వారిని చేశారు. వారిలాగే నేను కూడా ప్రతిభను అందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను చెప్పారు కమల్. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, సముద్రఖని నటించారు. లైకా ప్రొడక్షన్, రెండ్ జెయింట్ నిర్మించిన ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి.