
1954 నవంబర్ 7న జన్మించిన కమల్ హాసన్ పుట్టినరోజు నేడు. దీంతో ఆయన అభిమానులు, చిత్ర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ కొత్త చిత్రాల అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న భారతీయుడు 2 నుండి బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. నెత్తిమీద క్యాప్, ఖాకీ యూనిఫార్మ్ ధరించి దేశభక్తుడిగా కమల్ హాసన్ అలరిస్తున్నారు. ఆయన సీరియల్ లుక్ వైరల్ గా మారింది. 1996లో విడుదలైన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. దర్శకుడు శంకర్ భారతీయుడు చిత్రంతో సంచలనాలు నమోదు చేశారు.
ఈ క్రమంలో దానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చేస్తున్నారు. నిర్మాతలతో దర్శకుడికి ఏర్పడిన వివాదాల కారణంగా భారతీయుడు షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దీంతో శంకర్ హీరో రామ్ చరణ్ తో మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టి చిత్రీకరణ జరుపుతున్నారు. భారతీయుడు 2 నిర్మాతలతో శంకర్ కి అవగాహన కుదిరింది. ఈ క్రమంలో భారతీయుడు 2 పూర్తి చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇక దర్శకుడు మణిరత్నంతో కమల్ హాసన్ మూవీ ప్రకటించారు. 35 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. మణిరత్నం తెరకెక్కించిన నాయకుడు కమల్ హాసన్ కెరీర్లో నటించిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మణిరత్నం-కమల్ హాసన్ చేతులు కలిపారు. 2024లో ఈ మూవీ విడుదల కానుంది. పొన్నియిన్ సెల్వన్ మూవీతో మణిరత్నం ఫార్మ్ లోకి వచ్చారు. విక్రమ్ మూవీతో కమల్ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
విక్రమ్ మూవీ సంచలన విజయం సాధించింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 432 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. తెలుగులో ఈ మూవీ భారీ లాభాలు పంచింది. భారతీయుడు 2 తిరిగి సెట్స్ పైకి వెళ్ళడానికి విక్రమ్ విజయమే కారణం. కమల్ హాసన్ భారీ కమర్షియల్ హిట్ కొట్టి దశాబ్దాలు గడచిపోయాయి. ఎట్టకేలకు విక్రమ్ తో ఎవరూ ఊహించని విజయం నమోదు చేశాడు. తన మార్కెట్ ఎక్కడికీ పోలేదని నిరూపించాడు.