
లోకనాయకుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అస్వస్థతకు గురవడంతో బుధవారం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రి రామచంద్ర మెడికల్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. కమల్ హాసన్‌ని ట్రీట్ చేసిన వైద్యులు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఈ రోజు సాయంత్రం వరకు ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందట. కమల్‌కి అనారోగ్యం అనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తుంది.
కమల్ హాసన్ గతేడాది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనూ చేరారు. పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత `విక్రమ్` షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు. ఈ ఏడాది సంచలన విజయాలు సాధించిన చిత్రాల్లో `విక్రమ్` కూడా ఒకటి. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 350కోట్లు వసూలు చేసింది. తమిళనాట ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
ప్రస్తుతం కమల్ హాసన్ `ఇండియన్ 2` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాఉనంది. దీంతోపాటు మణిరత్నంతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే దీన్ని ప్రకటించారు. మరోవైపు తమిళంలో `బిగ్ బాస్` షోకి హోస్ట్ చేస్తున్నారు కమల్. ఇలా సినిమాలు టీవీ షోస్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో సందడిచేశారు. తన గురువుగా భావించే దర్శకుడు కె. విశ్వనాథ్‌ని కలిశారు. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్లిన వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరడం గమనార్హం.