అంగరంగ వైభవంగా జరిగింది అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. ఆ అద్భుత ఘట్టానికి ఆహ్వానం అందినా రాలేదు టాలీవుడ్ తారక రాముడు. కారణం ఏంటి..? ఎన్టీఆర్ ఎందుకు అయోధ్య వెళ్ళలేదు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నిన్న( జనవరి 22) ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఈమహత్తర కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు తరలి వచ్చారు. శ్రీరామ కార్యంలో పాల్గొన్నారు. ఈ మహత్తర ఘట్టం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగింది. ఇక అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో అన్ని రంగాల నుంచి వేల మంది ప్రముఖులు సందడిచేశారు. సినీ రంగం నుంచి కూడా ఎంతో మందికి ఆహ్వానాలు అందాయి. దాంతో ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు వివిధ ఇండస్ట్రీల ప్రముఖులు పెద్ద సంఖ్యలో తారలు తరలివచ్చారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, బాలీవుడ్ నుంచి అమితా బచ్చన్, రణబీర్-ఆలియా భట్, విక్కీ కౌశల్ - కత్రీనా కైఫ్, కంగనారనౌత్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినా కాని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఆయన తప్పకుండా వెళ్తాడని.. అభిమానులు అనుకున్నారు. కాని తారక్ మాత్రం అక్కడికి వెళ్ళలేదు. అసలు ముందుగా రామ్ చరణ్ తో పాటు తారక్ ఇద్దరు కూడా అయోధ్యలో సందడి చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ తారక్ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.
అయితే తారక్ అయోధ్య వెళ్ళకపోవడానికి కారణం దేవర షూటింగే అని అంటున్నారు. ముందుగానే అనుకుని పెట్టుకున్న షెడ్యూల్ కారణంగా ఆయన అక్కడికి వెళ్లలేక పోయారట. అందులోనూ.. అదే రోజు దేవరలో సైఫ్ అలీఖాన్‌తో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సి ఉందని. దాంతో సైఫ్ షెడ్యూల్ ను బ్రేక్ చేస్తే.. నిర్మాతలు ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో.. వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశ్యంతోనే తారక్.. అయోధ్యకు వెళ్లలేదని టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరో వైపు సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా హాస్పిటల్లో చేరారు. దాంతో ఆయన దేవర సినిమా షూటింగ్ లోనే గాయపడ్డారని అంటున్నారు. ఈ విషయంలో కూడా క్లారిటీ రావల్సి ఉంది.