
జూ. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా అభిమానులని సొంతం చేసుకున్నారు. నటన, నడవడికతో అభిమానుల ప్రేమని పొందుతున్నాడు యంగ్ టైగర్. శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ కొన్ని రోజులుగా కోమాలో ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం అతడి ఆరోగ్యం విషమించింది. దీనితో జనార్ధన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనార్దన్ కోమాలోకి వెళ్ళాడు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన అభిమాని విషమ పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకున్న ఎన్టీఆర్ స్వయంగా అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. భగవంతుడిపై భారం వేయాలని, ప్రార్థించాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు.
అలాగే జనార్ధన్ తో కూడా ఎన్టీఆర్ ఫోన్ లో మాట్లాడారు. నువ్వు కోలుకుని రా.. మనం కలుసుకుందాం అని చెప్పాడు. ఎన్టీఆర్ మాటలకు జనార్ధన్ చేతి వేళ్ళు కదుపుతూ స్పందించినట్లు తెలుస్తోంది.
అయితే జనార్దన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో వైద్యులు కూడా కాపాడలేకపోయారు. మంగళవారం జనార్ధన్ ఆరోగ్యం విషమించడంతో తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. దీనితో కుటుంబ సభ్యుల్లో తీరని శోకం మిగిలింది. ఎన్టీఆర్ అభిమానులు కూడా జనార్దన్ మృతితో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జనార్దన్ తో ఫోన్ లో మాట్లాడాడు అని తెలుసుకున్న తర్వాత.. అభిమానులంతా అతడు కోలుకోవాలని ప్రార్థించారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రార్థనలు ఫలించలేదు.