Jamuna: ఫిల్మ్ ఛాంబర్‌కి జమున పార్థివ దేహం.. సాయంత్రం అంత్యక్రియలు..

By Aithagoni RajuFirst Published Jan 27, 2023, 12:41 PM IST
Highlights

సీనియర్‌ నటి జమున మృతితో టాలీవుడ్‌ లో విషాదం చోటు చేసుకుంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

సీనియర్‌ నటి జమున ఈ రోజు(శుక్రవారం) ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు, దక్షిణాది చిత్ర పరిశ్రమ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఆమె పార్థివ దేహం బంజరాహిల్స్ లోని ఇంటి వద్ద ఉంది. మధ్యాహ్నం రెండు గంటలకు  ఆమె భౌతికకాయన్ని ఫిల్మ్ ఛాంబర్‌కి తరలిస్తారు. సినీ, అభిమానుల సందర్శనార్థం ఛాంబర్‌లో ఉంచనున్నారు. 

అనంతరం సాయంత్రం 4.30 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్‌లోనే ఉంచి, ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో జమున భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు నటి జమున మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపాలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, మహేష్‌, కళ్యాణ్‌ రామ్‌ వంటి వారు స్పందించి విచారం వ్యక్తం చేశారు. 

ప్రముఖ నిర్మాత, రాజకీయ ప్రముఖుడు టి సుబ్బరామిరెడ్డి స్పందించారు. `సుప్రసిద్ధ బహుభాషా నటీమణి, లోక్ సభ మాజీ సభ్యురాలు జమున గారు మరణం చిత్ర పరిశ్రము తీరని లోటు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో చింతించాను. వెండి తెరపై సత్యభామ అంటే జమున గారు అనేలా గుర్తుండిపోయారు. ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. ప్రేక్షకలోకంలో స్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. లోక్ సభ సభ్యురాలిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కళాపీఠం తరఫున ఆమెను సమున్నతంగా సత్కరించు కోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను. జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను` అని వెల్లడించారు. అలాగే శరత్‌ కుమార్‌ సైతం తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసుకున్న జమున ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దం పట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి. మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అనేక సినిమాలు చేసి మెప్పించిన జమున మృతి తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటని చెప్పొచ్చు. 
 

click me!